పవన్ కళ్యాణ్ : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వర రావు చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ ఢిల్లీ కి వెళ్లి , అమిత్ షా ని కలిసి , మాజీ సీఎం జగన్ ని అరెస్ట్ చెయ్యాలని కోరారని, అందుకు అమిత్ షా నవ్వుతూ సమాధానం చెప్తూ ‘చంద్రబాబు కంటే మనకి జగన్ చాలా నమ్మకస్తుడు, అతన్ని ఇబ్బంది పెట్టడం వల్ల మనకి అనవసరం, కాబట్టి ఈ విషయం మర్చిపో’ అంటూ పవన్ కళ్యాణ్ కి చెప్పాడని, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో భూకంపం సృష్టించింది. ఈ విషయం పై నాదెండ్ల మనోహర్ , నాగబాబు వంటి వారు కూడా రెస్పాన్స్ ఇవ్వడం , నాగేశ్వర్ మాటలను తప్పుబట్టడం జరిగింది.
అందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అయినప్పటికీ జనసేన నాయకులు ఆయనపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ నేడు రాజమండ్రి పర్యటనలో భాగంగా కాసేపటి క్రితమే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశాడు . ఈ సమావేశం లో ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు మాట్లాడిన మాటలకు చాలా ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘శత్రువులు ఎక్కడో లేరు , మన పార్టీలో ఉన్నారు. అమిత్ షా గారితో నేను మాట్లాడిన మాటలు ఎలా బయటకు తెలుస్తాయి?, వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను?, అలా అయితే జనసేన ఎదుగుతుందా?, కేంద్ర హోం మంత్రితో ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతారా?, ఇది మహోన్నతమైన మన వ్యవస్థను అవమానించడమే, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసమే షా ని కలిశాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
అంతే కాకుండా తనపై రూమర్స్ ని ప్రచారం చేసేవాళ్లకు పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇస్తూ ‘జనసేన పై రాళ్లు వేద్దామనుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను కూడా అందరి లాగానే సాధారణమైన మనిషిని , నాకు కూడా కోపాలు , పౌరుషాలు ఉంటాయి. మీరు ఎల్లప్పుడూ మమల్ని కొడుతూ ఉంటే , మేము చూస్తూ చేతులు కట్టుకొని నిలబడాలా?, కష్టాలు, కన్నీళ్లు మీకే ఉంటాయా?, మీరు ఏమన్నా , మేము భరించాలా ?, భరించినంత కాలం భరిస్తాం, సహిస్తాం , అవసరమైతే తాట తీస్తాం , ఈ మాట నేను చాలా ఏళ్ళ క్రితమే చెప్పా’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

