ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రయోజనాలు: పెరుగుతున్న ఇంధన ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ వాహనాల కోసం చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలతో తక్కువ ఖర్చవడంతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉందని కొందరు ఇప్పటికే కొనుగోలు చేసిన వారు చెబుతున్నారు. ముఖ్యంగా వాహనాలపై ఎక్కువగా వ్యాపారం, ఉద్యోగం చేసేవారికి విద్యుత్ వాహనాలు తప్పనిసరి అని అంటున్నారు. అయితే వీరికి మరింత ఉపయోగకరమని ఎలక్ట్రిక్ వాహన విక్రయ సంస్థ ‘ఓలా’ ఫౌండర్ భవిష్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఈవీల అవసరం ఎవరికి ఉంది?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ సామాన్యులపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో, ద్విచక్ర వాహనాల ద్వారా జీవనోపాధి పొందే వారికి ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారాయని భవిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఇంధన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా తమ సంపాదనను పెంచుకోవడానికి ఈవీలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా డెలివరీ ఏజెంట్లు, రైడ్-షేరింగ్ డ్రైవర్లు వంటి ‘గిగ్ ఎకానమీ’ వర్కర్లకు ఈవీలు ఒక వరంలా మారాయని ఆయన వివరించారు. ఈ వర్కర్లు రోజువారీగా చాలా దూరం కావాల్సి ఉంటుంది. దీనివల్ల వారికి ఇంధన ఖర్చులే అతిపెద్ద భారంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీలు వారికి కేవలం వాహనాలు మాత్రమే కాదు, వారి ఆర్థిక భద్రతకు అవసరమైన సాధనాలుగా మారాయని ఆయన అన్నారు.
ఈ రంగానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సామాన్య వర్గాలకు మరియు గిగ్ వర్కర్లకు అందుబాటులో ఉండే ఓలా ఎలక్ట్రిక్ సంస్థలు తక్కువ ధరకే స్కూటర్లను రూపొందించినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన ఈవీలను తక్కువ ధరకే అందించడం ద్వారా, గిగ్ వర్కర్ల జీవన ప్రమాణాలను తగ్గించడం మరియు వారికి స్థిరమైన ఉపాధిని కల్పించడం తమ లక్ష్యమని ఆయన వివరించారు.
భారతదేశంలో గిగ్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోందని, రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ రంగంలో లక్షలాది మంది ఉపాధి పొందుతారని అగర్వాల్ అంచనా వేశారు. ఈ పెరుగుదలతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, ఆర్థికంగా కూడా లాభదాయకమైన ఈవీలు రానున్న కాలంలో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

