తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వేసవి రద్దీతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. తిరుమలలోని మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు ఎనభై వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
పరిమిత సంఖ్యలో గదులు…
తిరుమలలో పరిమిత సంఖ్యలో వసతి గదులు ఉన్నాయి. దీనితో 60వేల మంది భక్తులకు మించి తిరుమలలో వసతి కేటాయించడానికి వీలుపడదు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7500 గదులు, ఐదు యాత్రికుల వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. గదులు పొందలేని భక్తులు తిరుమలలోని పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ (పద్మనాభ నిలయం), పీఏసీ-5 లలో ఉన్న దాదాపు తొమ్మిదివేల లాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. దీంతో భక్తులు బయటే నిద్రిస్తున్నారు.
శిలాతోరణం వరకూ…
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. శీఘ్రదర్శనం భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 89,399 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 49,985 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.92 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.

