ఆంధ్రప్రదేశ్:అన్నమయ్య జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.బి.
కొత్తకోట,కురబలకోట,పెద్దతిప్పసముద్రం మండలాల్లో స్థానిక నేతల అండదండలతో మట్టి అక్రమ రవాణా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పచ్చని ప్రకృతిని కాపాడే చెరువులనే లక్ష్యంగా చేసుకుని మట్టి మాఫియా దందా కొనసాగుతుండగా, సంబంధిత అధికారులు మాత్రం నిద్రపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే బి.కొత్తకోట పరిసర ప్రాంతాల్లోని పలు చెరువులను అక్రమంగా ఆక్రమించుకున్న దుండగులు, ఇప్పుడు వాటిల్లోని మట్టిని భారీగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జేసీబీలు,టిప్పర్ల సహాయంతో చెరువుల నుంచి మట్టిని తీసి ఇటుక బట్టీలకు తరలిస్తూ లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపిస్తున్నారు.చిన్న టిప్పర్ లోడు మట్టిని రూ.3,800కు రూ.6,000 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.ఈ దందా వెనుక కొంతమంది అధికారుల సహకారం కూడా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చెరువులు కనుమరుగైతే భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు భవిష్యత్తులో తీవ్ర నీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని చెరువులను కాపాడాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

