మానవ భావోద్వేగాలు మరియు బంధం: ప్రేమ, పరస్పర నమ్మకం, త్యాగం, అర్థం చేసుకోవడం… ఈ నాలుగు విలువల మీదే దాంపత్య జీవితం నిలబడుతుంది. అలాంటి భార్యాభర్తల బంధాన్ని మరింత గుర్తు చేసుకునే రోజు ‘దంపతుల దినోత్సవం’గా మే 29న చాలామంది జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య ప్రేమను, అనుబంధాన్ని, కలిసి నడిచే జీవిత ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది.
చాలామంది దాంపత్య జీవితం అంటే కేవలం ఒక కుటుంబ బాధ్యతగా భావిస్తారు. కానీ నిజానికి అది ఇద్దరు వ్యక్తుల కలయిక. జీవితంలో సుఖదుఃఖాలను పంచుకోవడం. ఒకరికి ఒకరు అండగా నిలవడం. కలిసి ఎదగడం దాంపత్య బంధానికి అసలైన అర్థం. అందుకే దంపతుల దినోత్సవం కేవలం ఒక సెలబ్రేషన్ కాదు… ఒకరికొకరు ఎంత ముఖ్యమో గుర్తు చేసుకునే సందర్భం.
ప్రతిరోజూ కలిసి టీ తాగడం, పని అయిపోయాక మాట్లాడుకోవడం, ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు పట్టించుకోవడం… ఇవన్నీ చిన్న విషయాలలా కనిపించినా దాంపత్య జీవితంలో ఎంతో విలువైనవి. ఈ రోజు అలాంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భార్యాభర్తలు తమ అనుబంధాన్ని మరింత బలపరుచుకుంటారు.
ఈరోజుల్లో ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, సమయం లేకపోవడం వంటి కారణాలతో చాలామంది దంపతుల మధ్య దూరం పెరుగుతోంది. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా కారణంగా కూడా వ్యక్తిగత సంభాషణలు తగ్గుతున్నాయి. ఇలాంటి దంపతుల దినోత్సవం వంటి రోజులు ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలని గుర్తు చేస్తున్నారు.
దంపతులు వేడుక సందర్భంగా ఖరీదైన బహుమతులు ఇవ్వడం కంటే, ఒకరోజు పూర్తి సమయం కలిసి గడపడం ఎంతో విలువైనదిగా అందరు. కలిసి భోజనం చేయడం, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం, ఒక చిన్న ట్రిప్‌కు వెళ్లడం లేదా ఒక మంచి మాట చెప్పడం కూడా సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. భారతీయ సంప్రదాయంలో భార్యాభర్తల బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ‘అర్ధాంగి’, ‘సహధర్మచారిణి’ వంటి పదాలు భార్యకు ఇచ్చిన గౌరవం. అలాగే కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడటంలో దంపతుల పరస్పర అవగాహన కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే దాంపత్యాన్ని ఒక పవిత్ర బంధంగా భావించారు.ౌ
అయితే ‘దంపతుల దినోత్సవం’ (జంటల దినోత్సవం) అనే ప్రత్యేక దినానికి సంబంధించిన స్పష్టమైన అధికారిక చరిత్ర లేదు. ఇది ఏదైనా ఒక దేశ ప్రభుత్వం లేదా అంతర్జాతీయ సంస్థ అధికారికంగా ప్రకటించిన రోజు కాదు. కాలక్రమేణా సోషల్ మీడియా, గ్రీటింగ్ కల్చర్, ప్రేమ మరియు సంబంధాలను సెలబ్రేట్ చేసే ఆధునిక ట్రెండ్ల ద్వారా ఈ రోజు ప్రసిద్ధ పొందింది. అయితే ఈ రోజు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ప్రేమను వ్యక్తపరచడం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య నమ్మకం, గౌరవం, పరస్పర అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేయడం. ఒక చిన్న శుభాకాంక్ష, ఒక మంచి మాట, కొద్దిసేపు కలిసి గడపడం కూడా బంధాన్ని మరింత బలపరుస్తుందని ఈ రోజు గుర్తుచేస్తోంది.

