రోజా: రాజకీయంగా మాజీమంత్రి రోజా దూకుడు స్వభావంతో ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులను విపరీతంగా ద్వేషిస్తారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆమె వాడే భాష, పదప్రయోగం తీవ్రంగా ఉంటుంది. ఇటీవల మెగా పై కూడా ఆమె తరచూ వ్యాఖ్యానాలు చేశారు. వారికి మద్దతుగా నిలిచే బుల్లితెర నటులపై కూడా నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే రాజకీయంగా విభేదించే రోజా సినిమాల పరంగా మాత్రం మెగా ఫ్యామిలీ వైపు మొగ్గు చూపడం విశేషం. మెగా ఫ్యామిలీతోనే తన సెకండ్ నోటి ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఆమె నుంచి వస్తోంది. చిరంజీవి అవకాశం ఇస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని ఆమె చెప్పుకోవడం విశేషం.
* చిరంజీవి వైపే మొగ్గు..
ప్రముఖ జర్నలిస్టు జాఫర్ హోస్ట్ గా బుల్లితెర ప్రవేశించారు మాజీ మంత్రి రోజా. ఆయన పలు ప్రశ్నలు వేశారు. సినిమా రంగంలో ఉన్న నలుగురు అగ్ర కథానాయకులు ఎవరితో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని ప్రశ్నించారు. మారు మాట చెప్పకుండా మెగాస్టార్ చిరంజీవి అంటూ తేల్చి చెప్పారు రోజా. ఆయనతో అయితే డాన్స్ పోటీపడి చేయమని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ అంటే వ్యక్తిగతంగా ఇష్టం కానీ.. చిరంజీవితో నటించడం అంటే తనకు ఆసక్తి అని నిర్మొహమాటంగా చెప్పారు. నాగార్జునకు తాను అభిమానిని.. ఆయనతో నటించానని చెప్పారు. వెంకటేష్ తో ఒకే ఒక్క సినిమా మాత్రమే చేశానని.. ఆయన విషయంలో కూడా ఆప్షన్ లేదని తేల్చి చెప్పింది రోజా.
* అప్పట్లో ఆశీర్వాదం కోసం..
నిజానికి మెగాస్టార్ చిరంజీవితో రోజాకు మంచి అనుబంధమే ఉండేది. ఆయనతో కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించారు. మంత్రిగా ఎంపికైన తర్వాత చిరంజీవి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.. మరో మెగా బ్రదర్ నాగబాబుతో సుదీర్ఘకాలం ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకుంటూ వస్తున్నారు. మధ్య మధ్యలో మెగా ఫ్యామిలీ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ సినిమాల పరంగా చిరంజీవి ద్వారా రీఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో రోజా ఉన్నారు. మరి అందుకు చిరంజీవి అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

