ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారా? భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారా..? ఇటీవల ఆయన చుట్టూ నెలకొన్న వివాదాలు, విమర్శల మధ్య జూన్ 2న తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో హైదరాబాదులో సమావేశం నిర్వహించి పార్టీ ప్రకటించడంతో వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ సమావేశం జరగడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇటీవల స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరామర్శించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అనంతరం జరిగిన ఓ టెలివిజన్ చర్చలో రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
ఆ వ్యాఖ్యలపై కేసులు నమోదవగా, అనంతరం ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్ కూడా అరెస్టు వంటి చర్యలు అవసరం లేదని వ్యాఖ్యానించడంతో వివాదం కొంత సద్దుమణిగింది.
అయితే ఆ తరువాత కూడా కొందరు రాజకీయ నేతలు, సామాజిక వర్గాల ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి కనిపించింది. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీ విస్తరణపై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జనసేన పార్టీ ఆవిర్భావ ప్రకటన కూడా హైదరాబాద్‌లోనే జరగడం విశేషం. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభమైందని, రాష్ట్రానికి ప్రత్యేక అనుబంధం ఉందని జనసేన నాయకులు చెబుతున్నారు.
జూన్ 2 జరిగే సమావేశంలో పార్టీ సంస్థాగత, విస్తరణ విస్తరణ, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో జనసేన స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదుగుతుందా? లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో కీలక పాత్ర పోషిస్తుందా? అన్నదానిపై కూడా ఈ సమావేశం కొంత స్పష్టత ఇవ్వొచ్చని.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, పార్టీ ప్రకటించే కార్యాచరణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

