మన తెలంగాణ/హైదరాబాద్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ఇతర సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం ఖర్గే గుల్బర్గా వెళుతూ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఖర్గే రాక గురించి ముందుగానే సమాచారం ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
విమానాశ్రయంలో ఖర్గేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితర సీనియర్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అందరూ సమీపంలోని హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ అల్పాహర విందు చేస్తూ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఖర్గే జనగణన, ఓట్ల సవరణ (సర్) గురించి ప్రశ్నించగా, పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ పోలింగ్ కేంద్రాల ఏజెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించామని, వారు పోలింగ్ బూత్‌ల వారీగా ఏజెంట్లకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఏఐసిసి నుంచి ఇద్దరు ట్రైనీలు ఇచ్చిన శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉందని ఆయన వివరించారని సమాచారం. ఇతరత్రా సమస్యలేవీ లేవని, సాఫీగా సాగుతున్నదని ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది.

