- ప్రధాన కాల్వల నిర్మాణం 12 వేల ఎకరాలు అవసరం
- నార్లాపూర్ రిజర్వాయర్ తప్ప మిగిలినవన్నీ పెండింగ్‌లోనే…
- మొదలు కాని మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల పనులు
- 90 శాతం మేమే చేశామంటున్న బీఆర్ఎస్ నేతలు
- రూ. 27 వేల కోట్లతో 90 శాతం పనులెట్లని కాంగ్రెస్ లీడర్ల ప్రశ్న
- పాలమూరు ప్రాజెక్టులను పరిశీలించనున్న సీఎం
మహబూబ్ నగర్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులకు భూ సేకరణ సమస్యగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు, ఆర్ ఆండ్ఆర్ ప్యాకేజీల కోసమే భూ సేకరణ చేసి, ప్రధాన కాల్వల నిర్మాణం కోసం చేపట్టాల్సిన భూ సేకరణను పక్కన పెట్టారు.
ప్రాజెక్ట్ పరిధిలో అన్ని రిజర్వాయర్ల కింద కాల్వల నిర్మాణానికి 12 వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. రూ. 37 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ ను మొదలుపెట్టగా.. 2020లో అప్పటి ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు పెంచింది. ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు రూ.27 వేలు ఖర్చు చేయగా.. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి మరో రూ. 40 వేల కోట్లు అవసరం అవ సూచన.
తరచుగా పనులను అడ్డుకున్న రైతులు
ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నార్లాపూర్, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన రైతులు కోర్టులో కేసులు వేయడం, న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తరచూ పనులను అడ్డుకున్నారు. కాళేశ్వరం నిర్వాసితులకు ఇచ్చిన మాదిరిగానే తమకూ పరిహారం చెల్లించాలని ఉదండాపూర్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. కొందరు కోర్టును ఆశ్రయించడంతో పనులు ఆగిపోయాయి.
2022, 2023లో అధికారులు బలవంతంగా భూములను లాక్కొని పనులు చేసే ప్రయత్నం చేసినా.. నిర్వాసితులు ప్రతిఘటించారు. దీనికి తోడు ఈ రిజర్వాయర్ కింద ముంపు గ్రామాలను తరలించేందుకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజీని ప్రకటించగా.. ఇందుకు సేకరించిన భూముల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూమి ఒకరిదైతే.. పరిహారం మాత్రం బీఆర్ఎస్ లీడర్ల అకౌంట్లలో జమ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
40 నుంచి 50 శాతం పనులు పూర్తి…
హైదరాబాద్ 1తో పాటు పలు జిల్లాల్లో 2.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ కింద నార్లాపూర్, ఏడుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను, 36 మోటారులను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. బీఆర్ఎస్ హయాంలో ఆరు మోటారులను మాత్రమే ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో 15 మోటార్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నార్లాపూర్ రిజర్వాయర్, పంప్ హౌస్ పనులు పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి ఏడుల రిజర్వాయర్ వరకు నిర్మించే కెనాల్ పనులు 400 మీటర్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి.
పంప్ హౌస్ వద్ద 150 మెగావాట్ల కెపాసిటీ కలిగిన తొమ్మిది మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఐదు మోటార్ల పనులు పూర్తయ్యాయి. ఏడుల రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి.. ఇక్కడి నుంచి వట్టెం రిజర్వాయర్‌కు నీటిని తరలించే కాల్వ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
రిజర్వాయర్ కింద ఇంకా 40 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. వట్టెం రిజర్వాయర్ నిర్మాణంతో పాటు ఐదు పంపులను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి కర్వెన రిజర్వాయర్ వరకు నిర్మించాల్సిన కెనాల్ పనుల్లో పది కిలోమీటర్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి.
మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మెయిన్ కెనాల్ కు లింక్ కలిపే మరో కాల్వ పనులు ఏడు నాలుగు మేర పెండింగ్‌లో ఉన్నాయి. కర్వెన రిజర్వాయర్ నుంచి ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు నిర్మించే గ్రావిటీ కెనాల్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఉదండాపూర్ పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు. మొత్తం 18 కిటికీల మేర కట్ట నిర్మించాల్సి ఉండగా.. పది కిటకిటల మేర మాత్రమే కంప్లీట్ చేశారు. ఏడుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్లతో పాటు మిగిలిన రిజర్వాయర్ల వద్ద కాల్వల నిర్మాణం కోసం 12 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది. అలాగే ప్రధాన, కుడి, ఎడమ కాల్వలు, బ్రాంచ్, ఓపెన్, సబ్ కెనాల్స్, బ్రిడ్జి నిర్మాణాలతో పాటు పలు పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
జూన్ 4, 5 తేదీల్లో సీఎం పర్యటన
ఉమ్మడి పాలమూరు నిర్మిత జూరాల, కోయిల్ సాగర్, ఆర్డీఎస్, నెట్టెంపాడు, మహత్మా గాంధీ కల్వకుర్తి, రాజీవ్ భీమా, పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో పనులను సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ నెల 4, 5న పరిశీలించనున్నారు. ఆయా ప్రాజెక్టులను సందర్శించి, ఒక రోజు అక్కడే బస చేయనున్నారు. ఈ సందర్భంగా పెండింగ్ పనులు, వాటిని పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
పనుల పూర్తిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల వార్
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌కి సంబంధించి 90 శాతం పనులు తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మిగిలిన పది శాతం పనులను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు.
జూన్‌లో నిర్వహించే యాత్ర ప్రారంభోత్సవానికి కేటీఆర్, కార్నర్ మీటింగ్‌లకు హరీశ్ రావు, యాత్ర ముగింపు బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారని ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకుల మాటలకు… కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తున్నారు. పదేండ్లు అధికారంలో ఉండి 50 శాతం పనులను కూడా పూర్తి చేయలేదని చెబుతున్నారు. అధికారంలో ఉన్న రోజులు పాలమూరు ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించకుండా, కాల్వలకు భూ సేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.
2023 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ కోసం రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారు.. ఈ లెక్కన చూసినా ఇప్పటివరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రూ.55 వేల కోట్ల ప్రాజెక్టులలో రూ.27 వేల కోట్ల ఖర్చుతో 90 శాతం పనులు పూర్తి చేశారో బీఆర్ఎస్ లీడర్లు చెప్పాలని సవాల్ చేస్తున్నారు.

