అనంతపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలయింది. అక్కడ మాజీ ఎమ్మెల్యేకు, ప్రస్తుత ఎమ్మెల్యేకు మధ్య గత కొన్నేళ్ల నుంచి పడటం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎంతగా అంటే.. తాను వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. తాను పార్టీ హైకమాండ్ ను టిక్కెట్ ను కూడా కోరనని అన్నారు. అదే సమయంలో డీలిమిటేషన్ లో మరొక నియోజకవర్గంలో అవకాశమిస్తే వెళతానని, లేకుంటే పోటీకి దూరంగా ఉంటానని ప్రభాకర్ చౌదరి ప్రకటించారు.
దీనికి కారణాలు కూడా లేకపోలేదు. గత ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరిని కాదని తెలుగుదేశం పార్టీ నాయకత్వం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టిక్కెట్ ఇచ్చింది. కూటమి హవాలో ఆయన గెలుపొందారు. అయితే గెలిచిన నాటి నుంచి ప్రభాకర్ చౌదరిని పక్కన పెడుతూ వస్తున్నారు. ఆయన వర్గాన్ని కూడా దూరం పెడుతున్నారు. దీనితో రెండు వర్గాల మధ్య సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వార్ నడుస్తుంది. పార్టీ హైకమాండ్ స్పందించి వెంటనే ఇద్దరినీ పిలిపించి క్లాస్ పీకారు. అయినా మార్పు రాలేదు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తన అనుచరులను కావాలనే తొక్కేస్తూ నియోజకవర్గంలో ఇబ్బందులు పెడుతున్నారన్నది ప్రభాకర్ చౌదరి ఆరోపణ.
మరొకవైపు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో వంద శాతం సీట్లు గెలుస్తామని, ఎవరు అడ్డం పడినా గెలిచేది టీడీపీయేనని, తానేంటో చూపిస్తానని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మీడియా సమావేశం పెట్టి పరోక్షంగా ప్రభాకర్ చౌదరిపై సవాల్ విసిరారు. అనంతరం ప్రభాకర్ చౌదరి తాను వచ్చే ఎన్నికల్లో హైకమాండ్ తనకు అనంతపురం బీఫారం ఇచ్చానని, తాను పోటీ చేయనని చెప్పారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కదా? ఎన్నిసార్లు గెలుస్తారో గెలవనీయండి అంటూ సెటైరికల్ గా మాట్లాడటం కొత్త వీరిద్దరి మధ్య వార్ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. మొత్తం మీద అధికార టీడీపీలో ఈ విభేదాలు హైకమాండ్ జోక్యంతోనూ సమసిపోయేలా కనిపించడం లేదు.

