విశాలాంధ్ర – యాడికి: అనంతపురం జిల్లా యాడికి ఘటన రాయలచెరువు గ్రామంలో విషాద ఘటన. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మద్యానికి బానిస కావడంతో ఓ వ్యక్తి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది.పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి కృష్ణయ్య (38) తన భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రైతుల వద్ద కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ప్రస్తుతంగా మద్యానికి బానిస కావడంతో పనులకు వెళ్లడం మానేశాడు. దీంతో కుటుంబ పోషణ మొత్తం బాధ్యత భార్య కృష్ణవేణిపైనే పడింది.భర్తను పనులకు వెళ్లాలని పలుమార్లు కోరినట్లు కృష్ణయ్య పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే సమయంలో మద్యం కోసం డబ్బు అడిగిన కృష్ణయ్యకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య డబ్బు ఇవ్వలేకపోయింది. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణయ్య ఇంట్లో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీఐ శ్రీనివాసులు.

