ఈ రోజుల్లో ఎంత మంచి ఫుడ్ తింటున్నా చాలా మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. దీనికి కారణం మనం తినే తిండి మాత్రమే కాదు, ఆయుర్వేదం చెప్పిన కొన్ని నియమాలను పాటించకపోవడం కూడా. తెలియకుండానే రోజువారీ జీవితంలో చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మన శరీరం రోగాల బారిన పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఆ తప్పులేంటో చూద్దాం.
దాహం లేకపోయినా నీళ్లు తాగడం: చాలా మంది రోజంతా లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతూనే ఉంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం శరీరం సిగ్నల్ ఇచ్చినప్పుడే, అంటే నిజంగా దాహం వేసినప్పుడే నీరు తాగాలి. అవసరం లేకుండా ఎక్కువ నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగక, ఒంట్లో టాక్సిన్లు (వ్యర్థాలు) పేరుకుపోతాయి.
ఆకలి లేకుండానే లాగించేయడం: టైం అయిపోయింది కదా అని ఆకలి లేకపోయినా బలవంతంగా తినడం చాలా పెద్ద తప్పు. ముందు తిన్న ఆహారం పూర్తిగా అరిగిన తర్వాతే తదుపరి భోజనం చేయాలి. ఆకలి లేకుండా తింటే పొట్టలో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇక మన జీర్ణాగ్నిని గౌరవించి, ఆకలి వేసినప్పుడే తినడం అలవాటు చేసుకోవాలి.
విరుద్ధ ఆహారాలు కలిపి తీసుకోవడం: మనం తినే కొన్ని కాంబినేషన్లు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఉదాహరణకు పాలు-చేపలు, పాలు-పుల్లటి పండ్లు, వేడి పదార్థాలతో పాటు చల్లని ఐస్క్రీమ్లు పూర్తిగా కలిపి అస్సలు తీసుకోకూడదు. ఇక ఇలాంటి విరుద్ధ ఆహారాలు తింటే రక్తం అశుద్ధమవడమే కాకుండా, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తిన్న వెంటనే పడుకోవడం: మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన వెంటనే బెడ్ ఎక్కేయడం చాలా మందికి అలవాటు. ఇలా చేయడం వల్ల తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఫలితంగా ఊబకాయం (లావు అవ్వడం), గుండెల్లో మంట, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక తిన్న తర్వాత కనీసం వంద అడుగులైనా నడవడం చాలా మంచిది.
సహజ వేగాలను ఆపుకోవడం: ఆకలి, దాహం, నిద్ర, మలమూత్ర విసర్జన వంటి ప్రకృతిసిద్ధమైన వేగాలను ఎప్పుడూ బలవంతంగా ఆపకూడదు. ఆఫీస్ పనిలో పడో, బద్ధకం వల్లో వీటిని ఆపితే శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల మార్పుతో దెబ్బతింటుంది. ఇక ఇది తీవ్రమైన దీర్ఘకాలిక రోగాలకు.
ఇక ఆయుర్వేదం అనేది కేవలం మందులు మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. మనం రోజూ చేసే ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవు.
గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఆరోగ్య పరంగా ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా లేదా ఏదైనా తీవ్రమైన సమస్యలు ఉన్నా ఒకసారి ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం మంచిది.
పోస్ట్ ఆయుర్వేదం ప్రకారం ఈ తప్పులు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది! మొదట కనిపించింది మనలోకం – తాజా తెలుగు వార్తలు & నవీకరణలు.

