స్టార్ హీరోలను అభిమానులు ఎంత నిస్వార్థంగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అభిమానులకు కొదవే ఉండదు. హీరోలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా మంచి సినిమాలు చేస్తే.. వాళ్లు అంతకంటే ఏమీ ఆశించరు. ఎప్పుడైనా అవకాశం వచ్చి ఒక ఫొటో తీసుకుంటే ఉబ్బితబ్బిబ్బయిపోతుంటారు.
అలాంటి అభిమానుల్లో ఒకరు తన ఆరాధ్య కథానాయకుడిని ట్యాగ్ చేసి ఒక కామెంట్ చేస్తే.. ఆ ఫ్యాన్‌కు స్టార్ హీరో రిప్లై ఇవ్వడమే కాక, ఒక బహుమతిని కూడా పంపిస్తే తన ఆనందానికి అవధులు ఏముంటాయి? టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఇదే పని చేశాడు. తన అభిమానిని సంబరాల్లో ముంచేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
తారక్ తాజాగా తన ఇంట్లో కుకీస్ తయారు చేసి, వాటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తన చేతులతో స్వయంగా ఈ కుకీస్ రూపొందించాడు. ”మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు రెండు కుకీస్ పంపించారు అన్నా” అంటూ సాయితేజ అనే అభిమాని ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఆశ్చర్యకరంగా తారక్ ఈ పోస్టుపై స్పందించాడు. అది కూడా తనదైన శైలిలో.
బ్రహ్మానందం మీద ‘అడ్రస్ పెట్టు.. అడ్రస్ పెట్టు’ అంటూ తయారు చేసి ఒక మిమ్మల్ని పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫ్యాన్ వెంటనే అడ్రస్ షేర్ చేశాడు. తనకు తారక్ రిప్లై ఇచ్చిన పోస్టును షేర్ చేస్తూ.. దేవుడు తారక్ మీద తన ప్రేమను గుర్తించి ఈ అవకాశం కల్పించాడని.. తారక్ పంపే కుకీస్ కోసం చూస్తున్నానని.. తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజని చాలా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు.
స్టార్ హీరోలంటే అభిమానులకు అందనంత ఎత్తులో ఉంటారనుకుంటాం కానీ.. ఇలాంటి చర్యలతో ఫ్యాన్స్ మీద వారికున్న ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. అభిమాని పోస్టుకు ఒకెత్తయితే.. తారక్ వాడిన మీ రెఫరెన్స్ అతను సోషల్ మీడియాతో ఎంత బాగా కనెక్ట్ అయి ఉంటాడో అంటున్నారు. ఇలాంటి చర్యలు అభిమానులతో హీరోల బ్యాండింగ్ను ఎంతో పెంచుతాయనడంలో సందేహం లేదు.

