తెలుగుదేశం పార్టీ నాయకత్వం అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి తమను మరోసారి అధికారంలోకి తెస్తుందని భావించే అంతకు మించి తెలివి తక్కువ తనం మరొకటి ఉండదు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు సొంత పార్టీలో ఉంటే లుకలుకలను ముందు ఉంచుకోవాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని పారదోలాలి. జగన్ ను ఢీకొనడం అంత సామాన్య విషయం కాదు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. గత ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు, వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు వచ్చినప్పటికీ జగన్ బలం ఆ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంకును చూస్తే తెలుస్తుంది.
జగన్ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు ఇప్పటికీ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ పనితీరుపై ఉన్న వ్యతిరేకతలో కూడా అంతటి ఓటు బ్యాంకు వచ్చిందంటే సామాన్య విషయం కాదు. అది వైసీపీకి స్థిరమైన ఓటు బ్యాంకు అని చెప్పాలి. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఆల్ ఈజ్ వెల్ అని జబ్బలు చరుచుకుంటూ వైసీపీకి పట్టిన గతే ఆ పార్టీకి పడుతుంది. జగన్ ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే తమ పార్టీ ఓటు బ్యాంకును కూడా పదిలం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే 2029 నాటికి కూటమి పార్టీలకు మెజారిటీ ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అనేక కారణాలతో అధికారంలో ఉన్న పార్టీకి అననుకూలతలు ఉంటాయి. ఒకరికి పధకం వచ్చినా, మరొకరికి ఉద్యోగం వచ్చినా మరో పది మంది వ్యతిరేకమవుతారు. అది మానవ బలహీనత. వారంతా కూటమికి వచ్చే ఎన్నికల్లో శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. గ్రామాల్లోనూ కొందరే ఆర్థికంగా అభివృద్ధిని తమ కళ్లముందే చూసిన వారు ఆటోమెటిక్ గా అధికార పార్టీకి దూరమవుతారు. ఇది ఎన్నో ఎన్నికలు చెప్పిన అక్షర సత్యం. పార్టీల్లో అంతర్గత సమస్యలు కూడా కూటమికి కారణమవుతాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య పై స్థాయిలో సఖ్యత ఉంటే సరిపోదు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అందరూ కలసికట్టుగా ఉండాలి. అది లేకుంటే పార్టీలకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుంది. ప్రధానంగా అత్యధిక స్థానాల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో అసంతృప్తిని తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

