బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం చుట్టూ వివాదాల ముసురు అలుముకుంది. మొన్నటివరకు లవ్ ట్రాక్ సీన్లపై విమర్శలు రావడం, దాంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ సీన్లు ట్రిమ్ చేయడం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమా మరో సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఏకంగా లీగల్ ట్రబుల్స్‌ను ఫేస్ చేస్తోంది. ఈ సినిమా మేకర్స్‌పై ఎస్సీ/ఎస్టీ (SC/ST) అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ గిరిజన నాయకులు, సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ మేరకు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ సరికొత్త కలకలం రేగుతోంది.
‘పెద్ది’ సినిమాలో గిరిజనులను, వారి సంస్కృతిని తక్కువ చేసి చూపేలా.. అత్యంత అవమానకరంగా ఉండేలా పలు డైలాగులు ఉన్నాయని గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకటి ఎక్కువ సందర్భాల్లో వాడిన కొన్ని పదాలు, సంభాషణలు తమ మనోభావాలను చాలా తీవ్రంగా గాయపరిచాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి సినిమాలో కొన్ని సార్లు రామ్ చరణ్ పాత్రను ఉద్దేశిస్తూ కొండ నా *** అనే పదాలు వాడారు. ఇక ఈ విషయమై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం, విజయనగరం జిల్లాల్లోని వారికి, పోలీసులకు గిరిజన సంఘాల ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదులు సమర్పించారు. ఈ చిత్రంలో కేవలం సినిమాను ప్రదర్శించిన వారినే కాకుండా.. దాన్ని ఆమోదించిన వారిని కూడా వదిలే ప్రసక్తే లేదని గిరిజన నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సినిమాలో అభ్యంతరకర డైలాగులు పెట్టినందుకు గాను దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మించిన నిర్మాణ సంస్థ (మైత్రి మూవీ మేకర్స్/వృద్ధి సినిమాలు), అలాగే సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ఉన్న ఆ డైలాగులను కట్ చేయకుండా సర్టిఫికెట్ ఇచ్చిన ‘సెన్సార్ బోర్డు’ సభ్యులపై కూడా తక్షణమే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

