- రేవంత్ మార్వెల్ కల్పిత కథను నిజమైన చరిత్రగా భావించారు.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు “హైడ్రా”. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ హైడ్రా పేరు అందరికీ తెలుసు. అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
హైడ్రా.. హిట్లర్దా? గ్రీకు రాక్షసా? లేక ఇంగ్లీష్ సినిమా కల్పితమా?
రేవంత్ వ్యాఖ్యలతో మొదలైన ఆసక్తికర కథ!
బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, “హిట్లర్‌కు ఇష్టమైన పదం హైడ్రా. అతని కోర్ టీమ్ పేరు కూడా హైడ్రానే, అతను అనుకున్న వాళ్లను ఆ టీం హతమారుస్తుంది. ఆ స్పూర్తితోనే నేను హైడ్రా అని పేరు పెట్టాను” అని ఉంది. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ అప్రజాస్వామిక, నియంత వైఖరికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
కానీ ఈ రాజకీయ వివాదం మధ్య అసలు ప్రశ్న మాత్రం మిగిలిపోయింది… అసలు హైడ్రా అంటే ఏమిటి? దానికి సమాధానం తెలుసుకోవాలంటే మనం దాదాపు 2,700 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి!
గ్రీకు పురాణాల్లో పుట్టిన రాక్షసి
హైడ్రా అనే పదానికి మూలం ప్రాచీన గ్రీకు పురాణాలు. గ్రీకు కథల ప్రకారం, “లెర్నా” అనే ప్రాంతంలోని చిత్తడివనాల్లో ఒక భయంకరమైన బహు తలల పాము ఉండేది. అదే హైడ్రా. ఈ రాక్షసి ప్రత్యేకత…ఒక తలలను నరికితే రెండు తలలు మళ్లీ పుట్టేవి! అందుకే దాన్ని చంపడం అసాధ్యంగా భావించేవారు. అందుకే “హైడ్రా” అనే పేరు క్రమంగా ఒక ప్రతీకగా మారింది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ లీగల్ ఇమ్యునిటీ: ఫ్యూచర్ సిటీకి పటిష్టమైన రక్షణ – ఎవరొచ్చినా మార్చలేరు – మాస్టర్ ప్లాన్ !
ఒక సమస్యను అణిచివేస్తే మరిన్ని సమస్యలు రావడం అన్నట్టు..ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక సామెత వాడే మాట: “ఒక తల నరికి, దాని స్థానంలో మరో రెండు వస్తాయి.”(ఒక తలలను నరికితే మరో రెండు తలలు వస్తాయి.) అంటే ఒక సమస్యను పరిష్కరించేసరికి అది మరింత పెద్ద రూపంలో తిరిగి రావడం.
అయితే హిట్లర్‌కు హైడ్రాతో సంబంధం ఉందా?
ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. చరిత్రలో ఎక్కడా హిట్లర్‌కు చెందిన “హైడ్రా” అనే సంస్థ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. హిట్లర్‌కు చెందిన ప్రధాన భద్రతా వ్యవస్థలు ఎస్ఎస్ (SS) ఇది హిట్లర్ అంతరంగిక భద్రతా వ్యవస్థ, గెస్టాపో (గెస్టాపో) ఇది నాజీ పార్టీ ఇంటెలిజెన్స్ వింగ్, ఎస్డీ (SD). వీటిలో హైడ్రై అనే సీక్రెట్ నేమ్ కూడా దేనికీ లేదు. “హైడ్రా” అనే హత్యల బృందం లేదా ప్రత్యేక దళం నాజీ పార్టీ చరిత్రలో లేదు. అలాగే “హైడ్రా హిట్లర్‌కు ఇష్టమైన పదం” అని చెప్పడానికి కూడా ఎలాంటి చారిత్రక ఆధారాలు కనిపించలేదు.
మరి నాజీలతో హైడ్రా పేరు ఎందుకు వస్తుంది ?
దానికి కారణం చరిత్ర కాదు… హాలీవుడ్. ముఖ్యంగా మార్వెల్ కామిక్స్ అనే హాస్య కధలు. 1965లో మార్వెల్ రచయితలు స్టాన్ లీ మరియు జాక్ కిర్బీ కలిసి “హైడ్రా” అనే కల్పిత దుష్ట సంస్థను సృష్టించారు. తర్వాత వచ్చిన కథల్లో దాన్ని నాజీ జర్మనీకి చెందిన రహస్య శాస్త్ర విభాగంలో అక్కడక్కడ ప్రస్తావించారు.
కెప్టెన్ అమెరికా సినిమా విలన్‌గా హైడ్రా:
2011లో వచ్చిన “Captain America: The First Avenger” సినిమా చూసిన వారికి హైడ్రా బాగా గుర్తుంటుంది. అందులో హైడ్రా అనేది నాజీలతో అనుబంధం ఉన్న రహస్య సంస్థ అని చూపిస్తారు కానీ అది కేవలం కల్పిత కధ. దాని నాయకుడు రెడ్ స్కల్. ప్రపంచాన్ని ఆధీనంలోకి తెచ్చే లక్ష్యంతో పనిచేసే ఈ సంస్థ నాజీ జర్మనీ కంటే కూడా శక్తివంతంగా ఎదగాలని ప్రయత్నిస్తుంది. వారి నినాదం..
“ఒక తల నరికి, దాని స్థానంలో మరో రెండు వస్తాయి. హైడ్రా!” ఈ ఒక్క డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా హైడ్రా పేరును మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది.
ఇప్పటికీ హైడ్రా పేరు చలామనిలో ఎందుకు ఉంది?
హైడ్రా అనేది కేవలం ఒక పురాణ రాక్షసి కాదు… ఓ ఆలోచనా ధోరణికి సింబల్. కొన్ని సమస్యలు, కొన్ని సంస్థలు, కొన్ని ఉద్యమాలు… వాటిని అణచివేస్తే అవి అంతమవ్వవు, మరింత బలంగా తిరిగి వస్తాయి. అలాంటి పరిస్థితులను ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకులు “హైడ్రా ఎఫెక్ట్”గా అభివర్ణిస్తుంటారు. ఉగ్రవాద సంస్థలు, భూగర్భ నెట్‌వర్క్‌లు, తీవ్రవాద భావజాలాలు వంటి వాటిని వివరిస్తూ ఈ ఉపమానాన్ని తరచుగా ఉపయోగిస్తున్నారు.
రేవంత్ అసలు కధ తెలియక అపార్థం చేసుకున్నారా?
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయి ప్రధాన సమస్య… మార్వెల్ సినిమాల్లో చూపించిన కల్పిత హైడ్రాను, నిజమైన చరిత్రతో కలిపి చెప్పడం. వాస్తవ చరిత్రలో… హైడ్రా గ్రీకు పురాణాల రాక్షసి, మార్వెల్ కధల్లో అది నాజీలతో అనుబంధం ఉన్న విలన్ సంస్థ. కానీ రెండూ ఒకటే అనేందుకు ఆధారం లేదు. అలా .. హైడ్రా కథ ఒక పురాణ రాక్షసి, తర్వాత అది ఒక నాటకంగా మారింది, ఆ తర్వాత కామిక్స్‌లో విలన్ సంస్థగా రూపాంతరం చెందింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Also Read: CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే – మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
అయితే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం… హైడ్రా శక్తి దాని తలల్లో లేదు, తిరిగి పుట్టే సామర్థ్యంలో ఉంది. అందుకే రేవంత్ తెలియక చెప్పినా.. హైడ్రా వేల ఏళ్ల క్రితం గ్రీకు పురాణాల్లో పుట్టిన ఒక రాక్షసి పేరు, నేడు హైదరాబాద్ రాజకీయాల వరకు వచ్చి చేరింది. అది హిట్లర్ కథ కాదు… హైడ్రా ఒక పురాణం, పాప్ కల్చర్, ఇప్పుడు రేవంత్ ప్రకటనతో అది రాజకీయం ఐంది.
లీఫ్ హెల్మెట్ ధరించిన వ్యక్తి వైరల్ వీడియో | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!

