ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా 1,590 కోట్లు! ఇది ఏ కార్పోరేట్ కుంభకోణమో, బ్యాంకు ఎగవేత వ్యవహారమో కాదు. ఇదొక భారీ నీటి పారుదల ప్రాజెక్టు అంచనా వ్యయం అంతకం కాదు.. ఇది అక్షరాల పది కాలాల పాటు పది మందికి అన్నం ప్టె రైతన్న జేబుల నుంచి కేవలం ఒక్క “యాసంగి” సీజన్లో కొల్లగొట్టిన సొమ్ము. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి పాపానికి రైతుల ముక్కుపిండి వసూలు చేసిన దగాకోరుల పగటి దోపిడీకి సజీవ సాక్షం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ముసుగులో జరుగుతున్న వ్యవస్థీకృత దోపిడీ రాష్ట్ర వ్యవసాయ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోతోంది.
దేశానికి వెన్నెముక రైతు అని పదేపదే ఉపన్యాసాలలో చెప్పుకునే మన వ్యవస్థలో.. ఆ వెన్నెముకను నిలువునా విరిచేస్తున్న దళారీ గడ్డల గురించి, చోద్యం చూస్తున్న అధికారుల తీరు ఎంత చెప్పినా తక్కువే. గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా, అవి రైతుల కష్టాలను తీర్చలేకపోతున్నాయి. సకాలంలో కొనుగోళ్లు జరపడం అన్నదాతలు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దయనీయ పరిస్థితి. సరిగ్గా ఇక్కడే సిండికెట్గా మారిన మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు.. రైతుల అమాయకత్వాన్ని, వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు.
అధికారుల కళ్లముందే ఇంతజరుగుతున్నా వారు చూసీచూడనట్లు వ్యవహరించడం వ్యవస్థలోని డొల్లతనానికి అద్దం పడుతోంది. ఈ దోపిడీ ఏ ఒక్క గ్రామానికో, మండలానికో పరిమితం కాలేదు. క్షేత్రస్థాయి పరిస్థితికి జగిత్యాల జిల్లా ఒక సజీవ సాక్షం. ఈ యాసంగిలో జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాల్సిన నిర్వహకులు తరుగు పేరుతో అడ్డగోలు దోపిడీకి తెరలేపారు. ఒక్కో 40 కిలోల బస్తాకు ఏకంగా మూడు కిలోలకు పైగా అదనపు తూకం వేస్తున్నారు. అంటే క్వింటాళుకు 7 నుంచి 8 కిలోలు రైతు నష్టపోతున్నాడు. ప్రభుత్వ మద్దతు ధరను బట్టి చూస్తే అదనపు తూకం వల్ల క్వింటాళుకు రూ. 165 కోట పడుతుండగా, హమాలీ చార్జీలను అదనంగా రూ. 20, బస్తా లారీకి ఎక్కాలంటే రూ. 5 చొప్పున మొత్తంగా క్వింటాలుపై. 190కి పైగా రైతుల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకోట్లకుపైగా రైతుల కష్టం దళారుల పాలైతే.. ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దందా ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో దాదాపు 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో ప్రభుత్వం ఇప్పటికే 80 లక్షల టన్నుల కొనుగోలు పూర్తయిందని ప్రకటించగా, మరో 5 నుంచి 10 లక్షల టన్నుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మొత్తం ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఏకంగా రూ. 1590 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఇది ఒక సీజన్లో అన్నదాత జేబుల నుంచి మిల్లర్లు, కేంద్రాల నిర్వహకులు లాగేసుకున్న కష్టం.
ఒక కుంభకోణాన్ని తలదన్నేలా సాగుతున్న ఈ దోపిడీ అధికారులకు కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వ్యవస్థలో లోపాలను సరిదిద్ది, రైతులకు మద్దతు ధర దక్కేలా చేయాల్సిన బాధ్యతను గాలికి వదిలేశారు. రైతుల గోస ఎవరికి పట్టదా? అన్నం పెట్టే అన్నదాతకే ఇలా సున్నం పెడితే వ్యవసాయం ఎలా మనగలుగుతుంది? పండించిన ప్రతి గింజను అమ్మకు ఏళ్ల తరబడి ఈ తిప్పలకు ముగింపు లేదా? వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, మిల్లర్లు, నిర్వహకుల సిండికెట్ను ఉక్కుపాదంతో అణచివేయకపోతే… ‘రైతు రాజు’ అనే నినాదం కేవలం ప్రసంగాలకే పరిమితం అవుతుంది. అధికారుల మౌనం, పాలకుల నిర్లక్షం ఇలాగే కొనసాగితే అన్నదాతల ఆక్రందనలు అరణ్య రోదనగానే మిగిలిపోతాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, ఈ వేల కోట్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.
పండించిన పంటను అమ్మ కోసం ఇలా ప్రతిసారీ అన్నదాతలు తిప్పలు పడాలా? తమ కళ్ళెదుట ఇంత బహిరంగంగా రైతులను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకుంటున్న అధికారులను ఏమనాలి? వ్యవసాయాన్ని పండుగ చేస్తామన్న నాయకుల మాటలు… కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కన్నీరు చూశాకైనా మారాలి. ఈ వేల కోట్ల రూపాయల దోపిడీపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి మిల్లర్లు, అధికారుల సిండికెట్పై ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. అన్నం పెట్టే అన్నదాతకు ఇలా సున్నం పెడుతూ పోతే… భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి ఎవరూ మిగలరనే పచ్చి నిజాన్ని ప్రభుత్వాలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
చీటి శ్రీనివాసరావు 98493 60698
(జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్)

