ఇటీవల అత్యంత వివాదాస్పదమై, లక్షలాదిమంది యువత భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టిన నీట్, సిబిఎస్ఇ వంటి పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయి బాధ్యతగల ప్రభుత్వ పెద్దలు కారణమని తేలిన సమయంలో దేశ యువత రోడ్లమీదకు వస్తున్న సమయంలో భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి యూజింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక ట్వీట్ అత్యంత ఆసక్తికరంగా కనిపించింది. మన దేశంలో జెఇ, నీట్ల వంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షల తరహాలో చైనాలో ‘గావో కావో’ పేరు పెట్టారు. ప్రపంచ దేశాల్లో జరిగే పోటీ పరీక్షలన్నిటిలో భారత, చైనా దేశాలు నిర్వహించే ఈ పరీక్షలే ప్రధానమయినవి. చైనాలో రెండు రోజుల పాటు ఒక కోటి 30 లక్షల మంది అభ్యర్థులు ఈ ‘గావో కావో’ పరీక్షలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ముగించుకొని ప్రశాంతంగా, సంతోషంగా ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ పరీక్ష జరిగిన రెండు రోజులు చైనా అంతటా ఫ్యాక్టరీల రణగొణ ధ్వని స్తంభించిపోయింది. రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి. దేశం మొత్తం విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే ఆ పరీక్షలకు బాసటగా నిలిచింది. సరిగ్గా మన దేశంలో ఈ పరీక్షల విషయంలో పెద్ద గందరగోళం నెలకొని ఉన్న సమయంలోనే చైనా అధికార ప్రతినిధి ఇటువంటి ట్వీట్ చేయడం ఆసక్తిని కలిగించిందని ప్రముఖ చైనా వ్యవహారాల నిపుణుడు, పబ్లిక్ పాలసీ నిపుణుడు మోహన్ గురుస్వామి నివేదించూ ఒక వ్యాఖ్య చేసారు. తేడాతో చైనాలో ప్రభుత్వం పని చేస్తుంది. ఇండియాలో ప్రజాస్వామ్యం పొంగి పొరలి ఇష్టరాజ్యంగా సాగుతుంది అన్నారాయన. మోహన్ గురుస్వామి చైనా, భారతదేశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి. చైనాలో విద్యకు విద్యార్థులు, యువకుల భవిష్యత్తుకు ఎంత ప్రాధాన్యతనిస్తారో ఈ ట్వీట్ అద్దం పడుతున్నది. మరి మన దగ్గర ఏం జరుగుతోంది?
కేవలం నీట్, సిబిఎస్ఇ ప్రశ్నపత్రాలు లీక్ కావడమే కాదు, మొత్తం విద్యా లోపభూయిష్టం అయిందని అక్కడ ఉన్న వ్యవస్థే చెబుతుంది. ‘బేటీ పడావో బేటీ బచావో’ అన్న నినాదం ఆకర్షణీయంగానే ఉంటుంది కానీ ఆచరణలో ఏం జరుగుతోంది. ఇప్పటికింకా ఒక లక్ష విద్యాసంస్థల్లో చదువుకునే ఆడపిల్లలకు సరైన మరుగుదొడ్ల వసతి లేదు. ఓ 15 వేల పాఠశాలలో వసతే కరువైంది. ఇక ఉపాధ్యాయుల విషయానికొస్తే 2004లో 8 లక్షల మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే, 2026 నాటికి అది పది లక్షలకు పెరిగింది. ఈ ఇబ్బందులన్నీ అధిగమించి ఒకవేళ ఆడపిల్ల చదువుకున్నా ఏ కాలేజీలో చేరుతుంది? 23 లక్షల మంది అభ్యర్థులు ఉంటే జెఇ సీట్లు మాత్రం కేవలం లక్ష. ఇక మెడికల్ కాలేజీల్లో సీటు కావాలంటే యాజమాన్యం కోటా కింద కోట్లాది రూపాయలు డొనేషన్లు చెల్లించాలి. మంచి విశ్వవిద్యాలయాలు అంటే నాణ్యత కలిగిన విశ్వవిద్యాలయాల కొరత ఇప్పుడు తీరనిది. అయితే ఇది సంపన్నులు, పలుకుబడి గల రాజకీయ నాయకులు, బడా వ్యాపారుల పిల్లలకు వర్తించదు. వాళ్లంతా ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి సామాన్యులకు పేర్లు కూడా తెలియని విదేశీ అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకోగల స్తోమత కలిగిన వారు.
ప్రస్తుతం జోరుమీద ఉన్న కాక్రోచ్ (బొద్దింక) జనతా పార్టీ ఉద్యమం రాజీనామా డిమాండ్ చేస్తున్న కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన పిల్లలు కూడా మనం ఎప్పుడూ విని ఉండని అంతర్జాతీయ విద్యాసంస్థల్లో చదువుకున్న వాళ్ళే. సామాన్యుల పిల్లల విషయానికొస్తే 2014లో 3 లక్షల మంది విద్యార్థులు చదువులు మానేశారు. 2026 నాటికి ఈ సంఖ్య 9 లక్షల పది వేలకు పెరిగింది. విదేశీ విద్య మీద 2014లో రూ. 79,500 కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు అది రూ. 5 లక్షల 85 వేల కోట్లకు పెరిగింది ఒక అంచనా. ఇది మన దేశంలో 28 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల వార్షిక బడ్జెట్ల కంటే ఎక్కువ మొత్తం. ఈ డబ్బు చెల్లించిన విద్యార్థులలో 60 శాతం మందికి పైగా అప్పులు చేసిన వాళ్లే.
మన దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విశ్వవిద్యాలయాల మీద, విషయాల పరిశోధన అభివృద్ధి మీద తగినంత పెట్టుబడి పెట్టడం లేదు. నిధుల కొరత అనేది ప్రధాన సమస్యగా మారింది. 2004 నుండి కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ పాలనలో 3.2 శాతం మాత్రమే కేటాయింపు జరిగితే, 2026 వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ కోసం ఎన్‌డిఎ పాలనలో అది 2.8 శాతం తగ్గింది. ఏ ప్రభుత్వమూ విద్యపట్ల శ్రద్ధ వహించడం లేదనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి? అని కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న యువతీ యువకుల్లో ఎవరిని కదిలించినా ప్రశ్నిస్తున్నారు.
విద్య పరిస్థితి ఇట్లా ఉంటే ఈ దేశంలో ప్రతి ఏటా కాలేజీల నుండి బయటికి వస్తున్న 80 లక్షల మంది పట్టభద్రులలో అత్యధికులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అజీం ప్రేమ్ జీ యూనివర్శిటీ 2026లో రూపొందించిన ఒక నివేదిక ప్రకారం అలా కొద్ది మందికి మాత్రమే పట్టభద్రులు అయిన ఒక సంవత్సర కాలం లోనే స్థిరమయిన వేతనాలు కలిగిన ఉద్యోగాలు లభిస్తున్నాయి. గత కొద్ది దశాబ్దాలుగా భారతీయ యువతీ యువకులకు పెద్ద మొత్తంలో వేతనాలు లభిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు కూడా ఇప్పుడు కృత్రిమమేధ గండం వచ్చి పడిందంటున్నారు.
ఈ యువత కాక్రోచ్లుగా, పారసైట్లుగా తయారయ్యారని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దేశంలో సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్య మీద వ్యంగ్య వ్యక్తీకరణలో భాగంగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దేశంలో విద్యారంగం అధ్వాన స్థితి అటువైపు నుండి లోపభూయిష్టం అయిన అనేక రాజకీయ విధాన నిర్ణయాలు, వాటి అమలు వైపు మళ్ళాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ తరువాత తన ఉద్దేశం అది కాదని వివరణ ఇచ్చుకున్నా ఎవరూ పట్టించుకున్నట్టు లేరు. గత ఆదివారం నాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా తమ నిరసన ఉద్యమాన్ని విస్తరించేందుకు నిర్ణయించారు. ఆ తర్వాత పుణెలో, ఇవాళ హైదరాబాద్ సహా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఒక వెక్కిరింతగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ సీరియస్ రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతుందా అన్నది ఇవాళ దేశమంతటా జరుగుతున్న చర్చ. ఒక సమస్య తలెత్తినప్పుడు అప్పటికప్పుడు దాని పరిష్కారం కోసం కొన్ని ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. ఆ పని పూర్తయ్యాక అవి అంతరించిపోతుంటాయి. అయితే ఇవాళ దేశంలో విద్యారంగంలో నెలకొన్న అధ్వాన పరిస్థితులు ఉద్యమాన్ని ఎంతవరకు బలంగా నిలబెడతాయో చూడాలి. కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిన అభిజిత్ దీప్కే విద్యావంతుడైన యువకుడు, గతంలో ఆమ్ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా వాలంటీరుగా కూడా పని చేసారు.
అభిజిత్ దీప్కే అమెరికా నుండి తన ప్రకటన. ఆయన తాను అమెరికా నుంచి తిరిగి రాగానే విమానాశ్రయం నుండి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల అనుమతి తీసుకుని నిరసన స్థలికి వెళుతున్నానని, అందరినీ అక్కడికి తరలి రమ్మని అన్నారు. ఆయనకు ఆ శ్రమ కలిగించకుండానే అధికారులు విమానాశ్రయంలోనే నిరసన ప్రదర్శనకు అనుమతి ఇస్తూ లేఖను అనుమతించారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఢిల్లీ ప్రభుత్వం ఈ వైఖరి అనుమానాలకు తావిస్తున్నది. ఇవే అంశాల మీద అంతకు ముందు ఇతర రాజకీయ పార్టీల విద్యార్థి, యువజన విభాగాలు చెయ్యబోయిన నిరసన ప్రదర్శనలను చెల్లాచెదురు చేసి కాక్రోచ్ జనతా పార్టీ పట్ల ఇంత ఉదారంగా వ్యవహరించడానికి కారణం ఏమై ఉంటుంది. రాజకీయంగా మేల్కొనబోతున్న జెన్‌జీ వల్ల జరిగే నష్టాన్ని గుర్తించా, లేక ఇదొక ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమా అన్న సందేహాలు వెలువడుతున్నాయి.
ఏదిఏమైనా విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఈ సెగ బాగానే తగిలింది. రేపో మాపో జరగబోయే మంత్రివర్గ మార్పుల్లో ఆయనకు ఉద్వాసన తప్పదనిపిస్తోంది. రానున్న రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని దాని పోకడలను జాగ్రత్తగా గమనించాల్సి ఉన్నది. ఎందుకంటే ఇది ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ పేరుతో జన్ లోక్‌పాల్ బిల్లు కోసం ప్రారంభమైన ఉద్యమం నడిచిన దారిలోకి వెళ్తుందా అన్న సందేహం అయితే కలుగుతోంది. ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ తర్వాత కాలంలో ఆమ్ఆద్మీ పార్టీగా మారి ఫక్తు రాజకీయాలు చేసి ఇవాళ ఏ స్థితిలో ఉందో చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇదే మార్గం పట్టనున్నదా? ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వివిధ రకాల నిరసన ఉద్యమాలలో పాల్గొంటుంది 60 ఏళ్ల ప్రముఖ సంస్కర్త, పర్యావరణవేత్త, ప్రత్యేక లడక్ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆందోళన సాగించి జైలుకు వెళ్లి వచ్చిన సోనమ్ వా ఇంకో అన్న హజారే అవుతారా? కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజిత్ దీప్కే ఇంకో అరవింద్ కేజ్రీవాల్ అవుతారా అన్న సందేహాలైతే ఉన్నాయి.
ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తనలలో కాక్రోచ్ జనతా పార్టీ మొట్టమొదటి లక్ష్యం ఈ దేశంలోని మీడియాను విముక్తం చేయడం అని ప్రసంగించారు. మీడియాను స్వేచ్ఛగా పని చేయనివ్వండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన విజ్ఞప్తి కూడా చేశారు ఈ బహిరంగ వేదికల మీద నుండి. నిజమే మీడియా స్వేచ్ఛగా పని చేయగలిగిన పరిస్థితులే ఉంటే కాక్రోచ్ జనతా పార్టీలు, ఇతర ఉద్యమాల అవసరం ఇంతగా ఉండదు. సగం పని మీడియానే చేస్తుంది. వివిధ సందర్భాల్లో ఈ దేశ యువత ఏదో ఒక రూపంలో మేల్కొని అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతూనే ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ దాని నూతన స్వరం. ఆహ్వానించవలసిందే.
దేవులపల్లి అమర్

