దట్టమైన నల్లమల అడవిలో ఇక ప్రతి కదలికపై ఓ డిజిటల్ కన్ను నిఘా వేస్తోంది. వేటగాళ్లు, కలప స్మగ్లర్ల బారినుంచి చెట్లను, వన్యప్రాణులను కాపాడేందుకు తెలంగాణ టెక్నాలజీశాఖ అడ్వాన్స్‌డ్‌ని రంగంలోకి దించింది. సోలార్ పవర్‌తో పనిచేసే టవర్లపై అమర్చిన ఏఐ ఆధారిత థర్మల్ కెమెరాలు, జీపీఎస్ ఆధారిత యాప్‌లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఇప్పుడు స్మార్ట్ ఫారెస్ట్‌గా మారుతోంది.
పచ్చని ఎత్తైన చెట్లు, లోతైన లోయలు, కొండలు, గుట్టలు, కృష్ణానదీ తీరం అయిన నల్లమల అడవిలోని పులులు, వన్యప్రాణులు, టేకు చెట్లను వేటగాళ్లు, కలప స్మగ్లర్ల బారినుంచి కాపాడేందుకు హరిత నిధి ప్రత్యేక ప్రాజెక్టు కింద శాఖ అధికారులు సర్వైలెన్స్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దట్టమైన అడవిలో సోలార్ విద్యుత్‌తో పనిచేసే టవర్లు ఏర్పాటు చేసి, థర్మల్ కెమెరాలను అమర్చారు. ఇవి ఏఐ ఆధారిత ఆటోమెటిక్ ఇంటర్ నెట్‌తో పనిచేస్తాయి.
థర్మల్ కెమెరాలను మన్ననూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్ అరణ్యభవన్‌లోని టైగర్ ప్రొటెక్షన్ సెల్‌తో అనుసంధానం చేయబడింది. అడవిలోని కెమెరా ట్రాప్ ఇమేజ్‌లు, వీడియోల సాయంతో అడవుల సంరక్షణ కోసం గూగుల్ సిస్టమ్ సాయంతో టైగర్ మానిటరింగ్ సెల్ చర్యలు తీసుకుంటోంది. సంబంధితశాఖ కమాండ్ కంట్రోల్ రూం, టైగర్ సెల్ నుంచి నేరుగా అమ్రాబాద్ అభయారణ్యంలోని లైవ్ వీడియోలను 24 గంటలపాటు వీక్షిస్తూ సంరక్షణకు కొత్త చర్యలు చేపట్టారు.
అడవిలో కెమెరా ట్రాప్‌లకు చిక్కిన వేటగాళ్లు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ప్రా పరిధిలోని అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ అల్లంగట్టు ప్రాంతంలో మే18న ఆయుధాలతో వన్యలను వేటాడేందుకు తిరుగుతున్న నలుగురు వేటగాళ్లు ట్రాప్ కెమెరాకి కంటికి చిక్కారు. దాంతో కమాండ్ కంట్రోల్ రూంలో 30 సీసీటీవీ కెమెరాల్లోని 300 మోషన్ సెన్సిటివ్ కెమెరా ట్రాప్‌లలో వేటగాళ్ల వీడియోలు రికార్డు అయ్యాయి. ”చీకటిలో కూడా ఐదు మీటర్ల రిజల్యూషన్‌తో జంతువులు, మనుషులను గుర్తించగల థర్మల్ డ్రోన్ పరికరాలతో వేటగాళ్లను ఈజీగా గుర్తించామ”ని నివాసశాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.
ఇదే విధంగా మన్ననూర్ సమీపంలోని అడవుల్లో వన్యప్రాణులను వేటాడేందుకు ఆయుధాలతో వేటగాళ్లు సంచరిస్తుండగా కెమెరా ట్రాప్ వీడియోలో చూసిన అటవీశాఖ అధికారులు వారిని గుర్తించి అరెస్ట్ చేశారు.’1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం’ కింద వారిపై 30 ట్రాప్ కెమెరాల ఫుటేజీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
నెమలిని కాపాడిన యాంటీ పోచింగ్ స్క్వాడ్
హైదరాబాద్‌లోని ఆనంద్ నగర్ కాలనీలో జాతీయ పక్షి అయిన నెమలి గాయపడిందని స్థానికుడొకరు టైగర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. అలర్ట్ అయిన టైగర్ సెల్ అధికారులు వెంటనే ఆంట్రాక్ట్ పోచింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి గాయపడిన నెమలిని కాపాడి, నెహ్రూ జూపార్కులోని వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
చిరుత సంచారంపై శాఖ అలర్ట్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ ప్రాంతంలోని గుట్టల్లో మే నెల14న రాత్రి 8 గంటలకు చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు టైగర్ సెల్‌కు సమాచారం అందించారు. దీంతో తాము మహబూబ్ నగర్ డిఎఫ్ఓకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా ఆయన శాఖ బృందాన్ని సమీప గ్రామాలకు పంపించి అక్కడి ప్రజలు చిరుత బారిన పడకుండా అప్రమత్తం చేశారని టైగర్ సెల్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న రాత్రివేళ అమ్రాబాద్ అడవిలో పులి సంచరిస్తూ కెమెరాట్రాప్కు చిక్కింది. దీంతో అమ్రాబాద్ రాష్ట్రశాఖ అధికారులను అలర్ట్ చేశామని ఆయన చెప్పారు.
తెలంగాణ టైగర్ సెల్
టైగర్ సెల్ పనితీరులో టెక్నాలజీ వాడకం బాగా పెరిగింది. జీపీఎస్ ఆధారిత ఎం స్ట్రైప్స్ మొబైల్ యాప్, డ్రోన్ కెమెరా పర్యవేక్షణ, డిజిటల్ డేటా విశ్లేషణ ద్వారా పులుల సంచార మార్గాలను వన్యప్రాణి పరిరక్షణ విభాగం అధికారులు ఈజీగా గుర్తిస్తున్నారు. దీనివల్ల వేట, అడవి ఆక్రమణలు, వన్యప్రాణులపై ముప్పులను వేగంగా గుర్తించే అవకాశం లభిస్తుందని శాఖ వన్యప్రాణి విభాగం సీనియర్ అధికారి ఆంజనేయులు చెప్పారు. అలాగే, తెలంగాణలో పులుల సంరక్షణ, అక్రమ వేట నియంత్రణ, పులుల కదలికల పర్యవేక్షణ, మానవ- – వన్యప్రాణుల ఘర్షణల నివారణలో రాష్ట్రశాఖకు చెందిన టైగర్ సెల్ కీలక పాత్ర పోషిస్తోంది.
రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాలలో పులుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సమన్వయం చేస్తూ అడవుల జీవవైవిధ్య పరిరక్షణకు ఈ విభాగం వెన్నెముకగా నిలుస్తోంది. అరణ్యభవన్ కేంద్రంగా ఏర్పాటైన టైగర్ సెల్‌కి1543 ఉద్యోగాలు వచ్చాయని టైగర్ సెల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జనవరి నెలలో125 ఫిర్యాదులు, ఫిబ్రవరిలో158, మార్చిలో159, ఏప్రిల్ నెలలో157, మే నెలలో144 ఫిర్యాదులు టైగర్ సెల్‌లకు వచ్చాయి.
ఒకప్పుడు దట్టమైన అడవుల్లో జరిగే అక్రమ వేట, చెట్ల నరికివేతలను గుర్తించడం రెవెన్యూశాఖకు పెద్ద సవాలుగా ఉండేది. ఇప్పుడు ఏఐ ఆధారిత థర్మల్ కెమెరాలు, డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్, కమాండ్ కంట్రోల్ సెంటర్ల సాయంతో అడవిపై 24 గంటల నిఘా సాధ్యమవుతోంది. సాంకేతిక సిబ్బంది అప్రమత్తత, ప్రజల సహకారంతో పనిచేస్తే అమ్రాబాద్ మాత్రమే కాదు తెలంగాణ అడవులన్నీ మరింత సురక్షితంగా మారతాయనడంలో సందేహం లేదు. ప్రకృతి సంపదను భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇలాంటి సాంకేతిక సంరక్షణ అవసరం.
కలప స్మగ్లర్ల ఆటకట్టు
పెద్ద కందుకూరు శివారు ప్రాంత అడవిలో స్మగ్లర్లు ఈ ఏడాది మే 25న ఓ పెద్ద చెట్టును నరికి కలపను ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ విషయంపై గ్రామస్థుడు హైదరాబాద్ అరణ్యభవన్‌లోని టైగర్ సెల్‌కు వాట్సాప్ వీడియో కాల్ ఫిర్యాదు చేసి చెట్టు నరికిన ప్రదేశం ప్రాంతాన్ని కూడా చూపించారు. దీంతో అధికారులు వెంటనే సిద్ధిపేట రెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు చేరారు. వెంటనే ఆ సిబ్బంది వెళ్లి కలపను పట్టుకుని స్మగ్లర్లపై కేసు నమోదు చేశారు.

