- ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి సీఎం ఆదేశాలు
- నిబంధనలు కఠినంగా ఉండాలని సూచన
- మొత్తం స్కూళ్లను కేటగిరీలుగా విభజించే యోచన
- ఆ ప్రకారమే నిర్దిష్ట ఫీజుల ఖరారు
- ఈ నెలలోనే రూల్స్ తెచ్చేందుకు సర్కారు కసరత్తు
హైదరాబాద్, వెలుగు:ప్రైవేటు విద్యాసంస్థలారాజ్యానికి, ఫీజుల పేరుతో సాగుతున్న నిలువుదోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో.. ప్రైవేటు యాజమాన్యాలు విడతలవారిగా (ఇన్ స్టాల్ మెంట్స్) ఫీజు వసూలు చేసే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చి.. వారిని కట్టడి చేయాలని భావిస్తోంది. విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సిద్ధంగా ఉంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచన ఉన్నట్లు.
రూల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏటా అడ్మిషన్ల పేరుతో మధ్యతరగతి, పేద తల్లిదండ్రుల రక్తాన్ని పిండి రూ. వేల కోట్లు కొల్లగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్ కాలేజీల అక్రమ వసూళ్లకు తక్షణమే అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చర్యలకు పూనుకోవాలన్నారు. అత్యధికంగా పొలిటికల్ గా యాక్టీవ్‌గా ఉన్నవాళ్లే విద్యాసంస్థలు నడుపుతున్నందున.. ఎక్కడా రాజీపడకుండా కఠినంగా వ్యవహరించేలా ఫీజుల కట్టడి మార్గదర్శకాల వ్యవస్థ ఉండాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల విధానాలపై స్టడీ.. రిపోర్టులు సిద్ధం
రాష్ట్రంలో ప్రైవేట్ గుర్తింపు విద్యాసంస్థల ఫీజులపై ఇప్పటికే తిరుపతి రావు కమిటీ, తెలంగాణ విద్యా కమిషన్‌తోపాటు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నివేదికలు సమర్పించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలపైనా అధికారులు దేశంలో సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో ఫీజుల కట్టడికి కొనసాగుతున్న చట్టాలు, అక్కడి కోర్టుల తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేశారు. ఈ నివేదిక ఆధారంగానే ప్రతిపాదనలకు తుదిరూపు సీఈఎస్, సీఎంవో అధికారులకు సూచన చేసినట్లు తెలిసింది.
3 కేటగిరీలుగా స్కూళ్ల విభజన
ఫీజుల నిర్ణయం అందరికీ ఒకేలా కాకుండా, విద్యాసంస్థల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల ఆధారంగా శాస్త్రీయంగా వర్గాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం ప్రైవేటు స్కూళ్లను 3 కేటగిరీలుగా విభజించనున్నారు. ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆట స్థలం, భవన సౌకర్యాలు, ఉపాధ్యాయుల జీతభత్యాల ఆధారంగా ఏ కేటగిరీ స్కూల్‌కు ఎంత ఫీజు ఉండాలనే పరిమితిని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనివల్ల సాధారణ సౌకర్యాలు ఉంటాయి.. డిజిటల్, గ్లోబల్, ఇంటర్నేషనల్ అనే బోర్డులు తగిలించి వేలాది రూపాయలు గుంజే స్కూళ్లకు బ్రేక్ పడనుంది. పకడ్బందీగా అమలుచేసేందుకు ప్రతి స్కూల్లో ఫీజు డిస్కం చేయడంతోపాటు.. పేమెంట్స్, ప్రభుత్వం కంప్లైంట్ బాక్స్, ఫీజు చెల్లింపుల్లో యజమానులతో తల్లిదండ్రుల కమిటీ ఏర్పాటు వంటి వాటిని పరిశీలిస్తున్నారు.
విడతల వసూళ్లకు ముందే ‘బ్రేక్’
ప్రస్తుతం అకడమిక్ ఇయర్ (విద్యాసంవత్సరం) ప్రారంభం కావడంతో ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యాలు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేశాయి. అయితే, చాలావరకు విద్యాసంస్థలు ఫీజులను మూడు లేదా నాలుగు ఇన్ స్టాల్ మెంట్లలో వసూలు చేస్తున్నాయి. మొదటి విడత అడ్మిషన్ల సమయంలో తీసుకున్నా.. మిగిలిన విడతల ఫీజులు వసూలు చేసే లోపే కొత్త రూల్స్‌ను తీసుకొచ్చి కట్టడి చేయడం ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల (జూన్) లోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే అదనపు ఫీజుల బాదుడు నుంచి తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం లభించనున్నది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
చదువు అనేది వ్యాపారంగా మారి, సామాన్యుడికి భారం కాకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేవలం స్కూళ్లే కాకుండా, ఇంటర్మీడియెట్ కాలేజీల ఫీజులపై కూడా తక్షణ నిర్ణయం తీసుకోనున్నారు. మెటీరియల్స్, ఏసీ, స్పెషల్ కోచింగ్‌ల పేరుతో దోపిడీ చేస్తే గుర్తింపు రద్దు చేసేలా రూల్స్ రెడీ చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల పరిస్థితి, ఇష్టరాజ్యంగా వసూళ్లపై ఎవరైనా సరే.. పలుకుబడిలాంటివి ఏమీ చూడకుండా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది.

