భక్తులకు కనీస అవసరాలే కరువు..!
ఉత్సవాల వేళ మరోసారి వెలుగులోకి దేవదాయ శాఖ నిర్లక్ష్యం…
విశాలాంధ్ర – నార్పల: మండల పరిధిలోని గూగూడు గ్రామంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ కుళ్లాయిస్వామి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కొరత మరోసారి చర్చనీయాంశంగా మారింది. హుండీ ఆదాయం, బంగారం, వెండి కానుకలు, వేల ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ, భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ విఫలమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఉత్సవాల్లో గంటల తరబడి కుళ్లాయి స్వామి దర్శనం కోసం భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ రహదారి విస్తరణపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మహిళలు, వృద్ధులు, చిన్నారుల కోసం సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా పవిత్ర స్నానాలు చేసిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు లేక తీవ్ర స్థాయిలో ఉన్నారు. వేలాదిమంది భక్తులు వచ్చే ఆలయంలో ఈ తరహా ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల బస కోసం తగిన వసతి గృహాలు లేకపోవడంతో కుటుంబాలు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, నీడనిచ్చే షెడ్లు కూడా సరిగా లేకపోవడంతో ఎండవేడిమిలో, గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి.
ఆలయ పరిసరాల్లో పలు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడం, పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం కూడా భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఉత్సవాలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు కనిపించడం లేదు.”ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరమన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే మరోసారి భక్తులు ఇబ్బందుల మధ్యే ఉత్సవాలను జరుపుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

