తెలంగాణ:హైదరాబాద్ నగరంలో కోతుల బెడద( Monkey Menace ) రోజురోజుకూ పెరుగుతోందని విద్యానగర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బుధవారం నివాస ప్రాంతంలో కోతుల గుంపు ఓ మహిళపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు కావడం కలకలం రేపింది.
తీవ్ర గాయాలతో రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా ఇటీవల కాలంలో కోతుల గుంపులు తరచూ నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
ఇళ్లలోకి చొరబడటం,ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం,ఎదురైన వారిపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు పెరుగుతున్నాయని,ముఖ్యంగా చిన్నపిల్లలు,వృద్ధులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని కాలనీవాసులు చెబుతున్నారు.
కోతుల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటికీ సమర్థంగా చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో జీహెచ్ఈవో, అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కోతులను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, నివాస ప్రాంతాల ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

