కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం లాంఛనంగా గుర్తించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం రావడంతో పాటు, స్థాని కులకు ఉపాధి అవకాశాలు మెరుగవ్వనున్నాయి. జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ. 405 కోట్ల పెట్టుబడితో ఈ గనిని అభివృద్ధి చేసింది. 70 ఏళ్ల తర్వాత భారతదేశంలో సమీకృత ప్రాసెసింగ్ యూనిట్‌తో ఏర్పాటైన తొలి ప్రైవేట్ బంగారు గని ఇదే కావడం విశేషం. జొన్నగిరి, పగిదిరాయ్, ఎర్రగుడి గ్రామాల పరిధిలో 597.82 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఓపెన్-పిట్ గని విస్తరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ గని నుంచి దాదాపు 40 కిలోల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. రానున్న కాలంలో ఉత్పత్తి సామ ర్థ్యాన్ని ఏటా ఒక టన్ను (1000 కిలోలు)కు పెంచనున్నారు. ఇక్కడ మొత్తం 12 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 300, పరోక్షంగా మరో 300 మందికి ఉపాధి లభించనుంది. ఈ గని కార్యకలాపాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో భారీ ఆదాయం అందనుంది. తొలి సుమారు ఏడాది రూ. 57 కోట్లు, పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమయ్యాక ఏటా రూ. 144 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.

