తెలంగాణ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై సీరియస్ నెస్ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికలు ఇందుకు కారణం. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ విషయంలో ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్న నివేదికలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకింత ముందంజలో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఉదాసీన వైఖరిని వీడకుంటే నియోజకవర్గాల్లో మరొక నేతను పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అంటే రాజకీయ పార్టీల్లో గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించడం వల్లనే అక్కడ టీఎండీ, డీఎంకేలు ఓటమి పాలయినట్లు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నేత మాత్రం మొద్దు నిద్ర వదల్లేదన్నది వాస్తవం. తన నియోజకవర్గంలో తామే కింగ్ లమని తప్పించి, ఓట్లను తొలగిస్తే రానున్న ఎన్నికల్లో గెలవలేమన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని రేవంత్ రెడ్డి సయితం ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరొకవైపు బూత్ లెవెల్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో ఏదైనా ఓట్లు తొలగించే అభ్యంతరాలను తెలియజేసేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పనిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు జిల్లాల్లో పర్యటిస్తూ నేతలతో సమావేశమవుతూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై వారిని అలెర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో మాత్రం అధికారంలో ఉండి కూడా తమ నియోజకవర్గంలో ఓట్లను కాపాడుకునేందుకు ప్రయత్నించకపోవడం వల్లనే రేవంత్ సీరియస్ అయినట్లు సమాచారం. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికలలో టిక్కెట్ ఉండదని కూడా హెచ్చరించి రేవంత్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.

