జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ నాయకులను ముందుండాలని కూడా సూచిస్తున్నారు. కానీ, ఆయన చెబుతున్నట్టుగా.. లేదా ఆయన ఊహిస్తున్నట్టుగా పార్టీలో ఆ తరహా.. దూకుడు కనిపించడం లేదు. కేవలం పవన్ వస్తే కార్యక్రమాలకు హాజరు కావడం.. లేకుంటే లేదు.. అన్నట్టుగానే నాయకులు వ్యవహరిస్తున్నారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ.
గత ఏడాది ఉద్యమి పేరుతో సభ్యత్వ కార్యక్రమాన్ని కలిగి ఉంది. ఈ కార్యక్రమం సక్సెస్ వెనుక .. నాయకులు లేరని.. కేవలం వలంటీర్లుగా వచ్చి పార్టీకి సేవ చేస్తున్నవారే ప్రయత్నాలు చేశారని ఆయనే చెప్పడం గమనార్హం. ఇక, జనసేన ఎమ్మెల్యేల తీరు కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల మధ్యకు వచ్చే వారి కంటే కూడా.. పార్టీకార్యాలయం చుట్టూ తిరిగే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ, వాస్తవం ఏంటంటే.. ప్రజా’ల మధ్య’ ఉండాల’ని పవ’న్ చెబుతున్నారు.
అదేసమయంలో ఎమ్మెల్యేలు.. కూటమిలోని ఇతర పార్టీలతో కలివిడిగా లేరన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. పవన్ కల్యాణ్.. ఇటు టీడీపీ, అటు బీజేపీని కూడా సమయం, సందర్భం వచ్చినప్పుడు.. ప్రశంసిస్తున్నారు. వచ్చే భవిష్యత్తు మొత్తం ఆయా పార్టీలతోనే మడిపడి ఉంటుందని కూడా చెబుతున్నారు. కానీ, ఇలా నాయకులు పెద్దగా ఆలోచించడం లేదు. ఇది పార్టీకి వన్ మ్యాన్ యాక్షన్ మాదిరిగానే మారుతోంది. పవన్ కల్యాణ్ సమావేశాలు, సభలకు ఇస్తున్న ప్రాధాన్యం ఇతర నేతలు తమ సొంతగా కార్యక్రమాలు చేపట్టేందుకు జంకుతున్నారు.
కారణాలు ఏంటనేది వారు చెప్పడము లేదు. క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ బూత్ స్థాయి కార్యకర్తల ప్రమేయం తక్కువగా ఉంది. ఎక్కడా కూడా.. కార్యకర్తలను పెంచుకునే దిశగా నాయకుల అడుగులు వేయడం లేదు. పైగా.. ఉన్న కార్యకర్తలను కూడా సంతృప్తి పరచలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితి మారితేనే జనసేన పూర్తి స్థాయిలో అందరికీ చేరువవుతుంది. కేవలం పవన్ కోసం.. పవన్ చుట్టూ అన్నట్టుగానే ఇంకా పార్టీ ఉందన్న అభిప్రాయానికి కారణం క్షేత్ర స్థాయిలో నాయకుల మధ్య కలివిడి లేకపోవడమేనని అంటున్నారు.

