హైదరాబాద్: ఛాట్రినాక నుంచి కందికల్ గేట్ ఫ్లైఓవర్ ప్రారంభ ప్రాంతం వరకు సుమారు 225 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో జులై 1 నుంచి పనులు పూర్తయ్యే వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఛాట్రినాక నుంచి చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ (ఓల్డ్ గుట్ట ఎక్స్ రోడ్) వెళ్లే ప్రధాన రహదారిపై ఈ పనులు చేపడుతున్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇవి..
నల్లవాగు శ్మశానవాటిక నుంచి కందికల్ గేట్ ఫ్లైఓవర్ వైపు వెళ్లే అన్ని వాహనాలను నల్లవాగు శ్మశానవాటిక యూటర్న్ వద్ద ఓల్డ్ గుట్ట వైపు మళ్లిస్తారు.
లాల్ దర్వాజా నుంచి ఓపీ ఛాట్రినాక వైపు వచ్చే వాహనాలను బాబా బార్ లేన్ వద్ద బౌలి వైపు మళ్లిస్తారు.
గౌలిపురా నుంచి ఓపీ ఛాట్రినాకకు వచ్చే వాహనాలను ఛాట్రినాక వద్ద లాల్ దర్వాజా వైపు దారి మళ్లిస్తారు.
ఉప్పుగూడ నుంచి ఓపీ ఛాట్రినాక వైపు వాహనాలకు అనుమతి ఉండదు. ఆ వాహనాలను పంచముఖి హనుమాన్ దేవాలయం వద్ద గౌలిపురా వైపు మళ్లిస్తారు.
పౌరులు ఈ ట్రాఫిక్ మళ్లింపులను గమనించి తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని, ఎప్పటి వరకు ఈ మార్గాన్ని నివారించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
ట్రాఫిక్‌కు సంబంధించిన సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫేస్బుక్, ఎక్స్ సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించాలని తెలిపారు.

