– ప్రకటన –
ముఖ్యమైన మార్గాల్లో నిలిచిన సేవలు
ప్రయాణీకులకు సరిపడా లేని డీజిల్ బస్సులు
వినియోగంలోకి రావాలంటే ఆలస్యమయ్యే అవకాశాలు
నల్లగొండ రీజియన్లో 179 బస్సుల్లో 109 డిపోల్లోనే
మహాలక్ష్మి పథకం లబ్దిదారులకూ తప్పని ఇబ్బందులు
నవతెలంగాణ–నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ నిలిపేయడం.. ఆయా రూట్లలో వాటి స్థానంలో సరిపడా డీజిల్ బస్సులు నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల చూపులోని ప్రధాన మార్గాల్లో నల్లగొండ, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాతోపాటు పలుచోట్ల జరిగిన అగ్ని ప్రమాదాల నేపథ్యంలో భద్రతా కారణాలతో టీజీ ఆర్టీసీ జేబీఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ప్రత్యామ్నాయంగా ’మూలనపడి ఉన్న డీజిల్ బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ, అవి ప్రయాణికుల అవసరాలకు సరిపోకపోవడం తో బస్టాండ్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా వరకు వినియోగంలోకి రావాలంటే ఆలస్యమవుతుందని అధికారులు బస్సు చెబుతున్నారు. ఎప్పటినుంచో ఎలక్ట్రిక్ బస్సులకు సమస్యలు వస్తున్నాయని ..సంబంధింత శాఖ అధికారులు సీరియస్ గా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
రోడ్లపై 70 మాత్రమే..
నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ డిపోల పరిధిలో మొత్తం 179 ఎలక్ర్టిక్ బస్సులు ఉంటే.. శుక్రవారం 70 బస్సులు మాత్రమే నడిచాయి. మిగిలిన 109 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో సాధారణ రోజులతో బస్సుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
పూర్తిగా నిలిచిన సేవలు
ఎలక్ట్రిక్ బస్సులపైనే అధికంగా ఆధారపడిన దేవరకొండ–మాచర్ల, మునుగోడు, ఖమ్మం మార్గాల్లో పూర్తిగా నడవలేదు. ఈ మార్గాలకు ప్రత్యామ్నాయంగా కూడా తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాల్సిన బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని మార్గాల్లో ఉన్న కొద్ది సాధారణ బస్సులే నడవడంతో అవి పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఇతర ప్రయాణికులు దొరక్క ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
మహాలక్ష్మి పథకానికి తిప్పలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగిస్తున్న మహిళలు అత్యధికంగా ఇబ్బందులు పడ్డారు. సాధారణంగా ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించే మహిళలు బస్సుల కొరత కారణంగా గంటల తరబడి బస్టాండ్లలో వేచి ఉండాల్సి వచ్చింది. కొన్ని చోట్ల బస్సులు పూర్తిగా నిండిపోవడంతో మహిళలు ఎక్కలేక వెనుదిరిగిన పరిస్థితులు కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో ఉద్యోగాలు, ఆస్పత్రులు, మార్కెట్లు, విద్యాసంస్థలకు వెళ్లాల్సిన మహిళలు అవస్థలు పడ్డారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంతంత మాత్రమే
ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి అదనపు బస్సులు పంపినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రభావం కనిపించలేదని ప్రయాణికులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ మార్గాల్లో బస్సులు లేకపోవడం వల్ల గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఎలక్ట్రిక్ బస్సుల భద్రతా తనిఖీలు పూర్తిచేసి సురక్షితమని నిర్ధారించిన వెంటనే సేవలను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ బస్సులను తగిన సంఖ్యలో నడపాలని ఆర్టీసీని విజ్ఞప్తి చేస్తున్నారు.
– ప్రకటన –

