అంతర్గత విచారణకు కమిటీ ఆదేశాలు
బద్రీనాథ్ (ఉత్తరాఖండ్): అయోధ్య రాముని ఆలయ విరాళాల చోరీతో దేశ వ్యాప్తంగా హిందూ దేవాలయాల సొత్తుపై పెద్ద చర్చ నడుస్తుంటే…ఇప్పుడు విష్ణు ఆలయంలో విరాళాల దుర్వినియోగం అంటూ ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఈ ఆరోపణలను ఆలయ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై బద్రీనాథ్, కేథారినాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధ్యక్షుడు హేమంత్ ద్వివేది మాట్లాడుతూ… ‘నిధుల దుర్వినియోగం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున విచారణ కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఈ వ్యవహారానికి సంబంధించి విధుల్లో ఉన్న ఉద్యోగుల వివరాలనూ కోరాం’ అని తెలిపారు. కాగా… బద్రీనాథ్ ఆలయంలో ఆర్థిక అవకతవకలు జరిగిన భైరవ సేన అనే ఓ సంస్థ ఆరోపించింది. ఆలయ కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత సహాయకుడికి సంబంధమున్న నిధుల దుర్వినియోగం ఆరోపణలపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. నివేదిక అధ్యక్షుడు ద్వివేది…సోషల్ మీడియాలో తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించబడిన వ్యక్తి బీకేటీసీలో ఓ ఉద్యోగి మాత్రమేనన్నారు. ఆయన గతంలో ముగ్గురు మాజీ ఛైర్మన్ల వద్ద పనిచేశారని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై బీకేటీసీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి సోహన్ సింగ్ రంగడ్ మాట్లాడుతూ.. ‘నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో వెంటనే ఆలయ ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కానీ ఆ ఫుటేజీ స్పష్టంగా లేకపోవడంతో పూర్తివివరాలు తెలియలేదు. అయినప్పటికీ ఈ విషయం అత్యంత సున్నితమైనదిగా భావించి, ఛైర్మన్‌కు నివేదించాం’ అని చెప్పారు. ఛైర్మన్‌తో వారి ఉద్యోగుల వివరాలను సేకరించడం సహా వారిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు అంతర్గత కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. విచారణలో ఎవరైనా తప్పుచేసినట్లు రుజువైతే…వారిపై బీకేటీసీ చట్టం-1939, ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

