- నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలే అమలు చేస్తున్నాయి : మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : ‘గత పాలకులు అవినీతి సొమ్ము కోసం ఆశపడి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కూలేశ్వరంగా మార్చారు, కాళేశ్వరం నీటిని వాడుకున్నా అత్యధిక పంట దిగుబడి వచ్చింది’ అని మంత్రి సీతక్క చెప్పారు. ములుగు క్యాంప్ ఆఫీస్ లో ఆదివారం మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. తమ ప్రభుత్వానికి ప్రజల భద్రత ముఖ్యమన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం బీఆర్ ఎస్ హయాంలోనే కుంగిపోతే రిపేర్లు ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం కాళేశ్వరం వద్ద ఎత్తిపోతలు చేపడితే గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రమాదం. నీళ్లు ఎత్తిపోయాలని చెబుతున్న కేటీఆర్… నేషనల్ డ్యాం సేఫ్టీ ఆఫీసర్లతో మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు స్వయం ప్రకటిత మేధావులు, ఇంజినీర్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో నిధులు ఎత్తుకుపోయారు కాబట్టే.. ఇప్పుడు నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేకుండా పోయింది. అహంకార పూరితంగా, అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్న బీఆర్ ఎస్ నేతలకు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రజలపై ప్రేమ మద్దతు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల కోసం పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు.
మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్, కమిటి చైర్ పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ బైరెడ్డి భగవాన్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ చిటమట రఘు, మున్సిపల్ చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి ఉన్నారు.

