మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయగడ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండడంతో పాతాళ గంగ నది పొంగిపొర్లుతోంది. దీంతో, పలు గ్రామాలు నీటమునిగిపోయాయి. అంతేకాదు, వరద నీటి ఉధృతికి హెచ్ పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ నుంచి ఎల్పీజీ సిలిండర్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఖాలాపూర్ తాలూకాలోని చావణే ప్రాంతంలో ఉన్న హెచ్ పీసీఎల్ ప్లాంట్లోకి భారీగా వరద నీరు చేరుకుంది.
కొండ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్లాంట్ చుట్టూ ఉన్న రక్షణ గోడలను కూడా దాటుకొని లోపలకు చేరుకుంది. ప్లాంట్లో నిల్వ ఉంచిన దాదాపు 3 వేల గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో మునిగిపోయాయి. వరద నీటి ఉధృతికి సిలిండర్లు కొట్టుకుపోయాయి. ప్లాంట్ కు సమీపంలో పాతాళ గంగ నదిపై ఉన్న బ్రిడ్జి కింద నీటి ప్రవాహంలో సిలిండర్లు కొట్టుకుపోతున్నాయి. అలా పాతాళ గంగ నదిలో కొట్టుకుపోతున్న సిలిండర్లను కొందరు గ్రామస్థులు తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆ సిలిండర్లలో గ్యాస్ ఉందా లేదా అవి ఖాళీగా ఉన్నాయా అనే విషయంపై క్లారిటీ లేదు. అంతేకాదు, వాటికి ఉన్న వాషర్లు లీక్ అయ్యే ఛాన్స్ ఉందని, వరద నీటిలో రాళ్లకు తగిలి సిలిండర్లు డ్యామేజ్ అవకాశం కూడా ఉందని ప్లాంట్ సిబ్బంది చెబుతున్నారు. ఇటువంటి వాటిని ముట్టుకోవడం, ఓపెన్ చేయడానికి ప్రయత్నించడం లేదా వాడాలని చూడటం అత్యంత ప్రమాదకరమని ప్రజలను హెచ్చరిస్తున్నారు. సిలిండర్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి, వాటికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు.

