ఇటీవల: ఆల్కహాల్ కలిపిన మందుల విక్రయంపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. 12 శాతం కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ కలిగిన మందులను లైసెన్స్ లేకుండా విక్రయించడానికి వీల్లేదని నిర్ధారించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ మందులను విక్రయించాలని. 12 శాతం కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ కలిగి 30 మిల్లీలీటర్ల కంటే పెద్ద సీసాలు విక్రయించే సిరప్లు/టానిక్లను షెడ్యూల్ H1 పరిధికి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కొన్ని రకాల దగ్గు సిరప్లు, టానిక్లలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటోంది. వాటిని చికిత్స కోసం కాకుండా మత్తు కోసం దుర్వినియోగం చేస్తున్నారంటూ పలు రాష్ట్రాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్, డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీని వల్ల అవసరమైన రోగులకు మాత్రమే ఈ మందులు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.

