ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ యువకుడు చేసిన దారుణాలు గూగుల్ అలర్ట్‌తో బయటపడ్డాయి. తన గూగుల్ డ్రైవ్‌లో బాలికలు, మహిళలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను ఉంచుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గూగుల్ తన భద్రతా వ్యవస్థ ద్వారా అనుమానాస్పద కంటెంట్‌ను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
గూగుల్ అలర్ట్‌తో దర్యాప్తు:
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గూగుల్ డ్రైవ్‌లో చట్టవిరుద్ధమైన బాలల దోపిడీకి సంబంధించిన (CSAM) కంటెంట్ గూగుల్ గుర్తించింది. దీనితో ఈ ప్రక్రియలో భాగంగా అధికారులకు సమాచారం అందించింది. గూగుల్ అందించిన ఈ-మెయిల్ వివరాలు, IMEI నంబర్, IP అడ్రస్ వంటి డిజిటల్ ఆధారాల సహాయంతో సైబర్ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
మొబైల్లో అభ్యంతరకర వీడియోలు:
నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్ ఫోన్లను పరిశీలించగా.. అందులో అనేక ప్రైవేట్ వీడియోలను పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.
కంటెంట్‌పై నిఘా:
గూగుల్ డ్రైవ్‌లో నిల్వ చేసే కంటెంట్‌పై గూగుల్ భద్రతా వ్యవస్థలు నిరంతరం పర్యవేక్షించబడతాయి. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన కంటెంట్, బాలల దోపిడీకి సంబంధించిన మెటీరియల్ CSAM), ఉగ్రవాద ప్రచార కంటెంట్, కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫైళ్లు గుర్తిస్తే వాటిని ఫ్లాగ్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గూగుల్ నిబంధనల ప్రకారం ఇలాంటి దర్యాప్తు సంస్థలకు సమాచారం అందిస్తుంది. అవసరమైతే ఖాతా, IP అడ్రస్, డిజిటల్ వివరాలను కూడా అధికారులతో పంచుకుంటుంది.
గూగుల్ డ్రైవ్ అనేది వ్యక్తిగత డేటా నిల్వ కోసం ఉపయోగపడే క్లౌడ్ సేవ అయినప్పటికీ.. చట్టవిరుద్ధమైన లేదా గూగుల్ విధానాలను ఉల్లంఘించే కంటెంట్‌ను నిల్వ చేయడం లేదా షేర్ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి కంటెంట్ గుర్తిస్తే గూగుల్ చర్యలు తీసుకోవడమే కాకుండా.. సంబంధిత దేశ చట్టాల ప్రకారం పోలీసులు కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది.

