అరుణోదయ నాగన్నను తలచుకుంటూ.. అరుణోదయ నాగన్నగా తెలుగు ప్రజలకు చిరపరిచితుడైన పరకాల నాగయ్య కొంత కాలం అనారోగ్యంగా ఉంటూ జులై 3, 2026న ఖమ్మం జిల్లాలో మరణించాడు. ఖమ్మం జిల్లా రాజారం ఆయన స్వగ్రామం. నాగన్న సమాజ మార్పు కోసం జరిగిన ఉద్యమాలలో ప్రజా గాయకుడిగా తుదికంట నిలిచాడు. సుమారు అర్ధ శతాబ్దం పాటు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యకర్తగా, నాయకుడిగా అనేక మంది గాయకుల ను తీర్చిదిద్దాడు, వారికి స్ఫూర్తినిచ్చాడు. నాగన్న గాయకుడే కాదు అనేక పాటల్ని రాసిన కవి కూడా. తన రాజకీయ విశ్వాసాలకు, జీవితాచరణకు మధ్య అంతరం లేకుండా జీవించిన ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్నకు మెహఫిల్ నివాళి అని తెలుస్తోంది. ఎడిటర్, మెహఫిల్
చరిత్రలో కొందరు గాయకులను వింటే వారి పాట గుర్తుండదు. వారి గొంతు గుర్తుంటుంది. మరికొందరిని వింటే వారి గొంతు కూడా గుర్తుండదు. వారు నిలబెట్టిన మనుషులు గుర్తుంటారు. ఇంకా అరుదైన కొందరు ఉంటారు. వారి గొంతు, వారి జీవితం, వారి నమ్మకం విడదీయరాని ఒకే స్వరంగా మారిపోతాయి. అరుణోదయ నాగన్న అలాంటి అరుదైన గాయకుడు. ప్రపంచ సంగీత చరిత్రలో పాల్ రాబ్సన్ ఒక మహా గాయకుడు మాత్రమే కాదు, ఒక నైతిక స్వరం. అపూర్వమైన గొంతుతో ప్రపంచవ్యాప్త కీర్తిని సంపాదించగలిగిన, తన గొంతును నల్లజాతి ప్రజల కోసం, కార్మికుల కోసం, అణచివేతకు గురైన మనుషుల కోసం అంకితం చేశాడు. అందుకే అతను సంగీత చరిత్రలో కాదు, ప్రజల చరిత్రలో నిలిచిపోయాడు. నాగన్నను తలుచుకున్నప్పుడల్లా ప్రజలకు తమ గొంతును అంకితం చేసిన ఆ సంప్రదాయం గుర్తుకొస్తుంది.
ఆయనను కేవలం విప్లవ గాయకుడు అని చెప్పడం సరిపోదు. తన గొంతును ఒక రాజకీయ విశ్వాసానికి, ఒక సామాజిక స్వప్నానికి, చివరికి ఒక ప్రజల జీవితానికే అర్పించిన అరుదైన కళాకారుడు ఆయన. ఆయనకు పాట వృత్తి కాదు; జీవన విధానం. వేదిక వినోదం కాదు; బాధ్యత. దాదాపు యాభై సంవత్సరాల పాటు ఆయన గొంతు ప్రజల మధ్యే జీవించింది. అది సభల్ని మాత్రమే కాదు, ఉద్యమాల్ని కూడా చుట్టివచ్చింది. కాలం మారింది. కానీ నాగన్న గొంతు ఎంపిక పక్షం మాత్రం మారలేదు. ఆయన గానం గురించి చెప్పేటప్పుడు చాలామంది ‘మధురమైన గొంతు’ అంటారు. అది నిజమే. కానీ పాట ముగిసిన తర్వాత కూడా మనలో మిగిలేది రాగం కాదు; ఆయన విశ్వాసం. అందుకే ఆయన పాడిన పాటలు వినిపించేవి కాదు- నమ్మించేవి కూడా.
నాగన్న ప్రత్యేకత ఇంకో చోట కనిపిస్తుంది. చాలామంది గాయకులు తమ పాటలతో గుర్తింపు పొందుతారు. నాగన్న తన పాటలతో పాటు ఇతర రచయితల పాటలను కూడా తన గొంతులో పెంచి పెద్ద చేశాడు. ఒక కవి రాసిన పదాలకు ఆయన శ్వాస ఇచ్చేవాడు. ఒక రచయిత ఆవేదనకు ఆయన గొంతు ఇచ్చేవాడు. ఆయన పాడిన తర్వాత ఆ పాట రచయితది కాదు, ప్రజలదైపోయేది. ఒక గొంతు ఒక పాటకు ఇంత పెద్ద జీవితాన్ని ఇవ్వగలదా అనిపించేది. కొంతమంది రచయితలకు నాగన్న గొంతు దొరికింది. మరికొందరి పాటలకు శాశ్వత జీవితం దొరికింది. నాకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక రోజు ఉంది. నాగన్నే రచించిన ‘కుల రక్కసి కోరలు సాచిందీ నా దళిత బిడ్డల’ పాటను స్టూడియోలో రికార్డు చేసే అవకాశం నాకు దక్కింది. ఇప్పటికే పార్కిన్సన్స్ వ్యాధి ఆయన శరీరాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తోంది. ఒక చేయి ఆగకుండా వణుకుతోంది. నడకలో అలసట ప్రారంభమైంది. శరీరం తనను క్రమంగా విడిచిపెడుతోందనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి.
కానీ విచిత్రంగా… వణికింది చేయి. చూపు కాదు. గొంతు కాదు. గుండెలోని నమ్మకం కాదు. మైక్ ముందు నిలబడిన క్షణంలో ఆయన అనారోగ్యంతో పోరాడుతున్న మనిషిలా కనిపించలేదు. తన జీవిత విశ్వాసంలోకి మళ్లీ ప్రవేశిస్తున్న మనిషిలా కనిపించాడు. ఆయన తన పాటను పాడలేదు; తన జీవితాన్నే ఆలపించాడు. ప్రతి పదం గొంతులోంచి కాదు – జీవితంలోంచి వచ్చింది. ప్రతి పాదం శతాబ్దాల దళిత అవమానాన్ని మోసుకొచ్చినట్టుగా వినిపించింది. రికార్డింగ్ ముగిసి న తర్వాత ఆయన చేతిని పట్టుకున్నాను. ఆ చేయి స్వల్పం గా వణుకుతోంది. ఆ వణుకు నా చేతిలో నిలవలేదు. ఆయన గొంతు మోసిన విశ్వాసమే నాలో నిలిచిపోయింది. కొద్దిసేపు నిశ్శబ్దం. కొన్ని నిశ్శబ్దాలు చప్పట్లకన్నా గొప్పవి. అది అలాం టి నిశ్శబ్దం. ఆ రోజు నేను ఒక గొప్ప గాయకుడిని చూడలేదు. తన శరీరాన్ని క్రమంగా విడిచిపెడుతున్నా, తన గొంతును మాత్రం ప్రజల నుంచి వెనక్కి తీసుకోని ఒక మనిషిని చూశాను. కళాకారుడి గొప్పతనం ప్రతిభలో మాత్రమే ఉండదని, తన ప్రతిభను ఎవరికి అంకితం చేశాడనే నిర్ణయంలో ఆయన మరోసారి నేర్పించాడు.
చిలీకి చెందిన ప్రజాకవి, గాయకుడు విక్టర్ జారాను సైనిక నియంతృత్వం చిత్రహింసలకు గురిచేసినప్పుడు, అతని చేతివేళ్లను విరగ్గొట్టి, ‘ఇప్పుడు పాడు చూద్దాం’ అని అవహేళన చేశారు. కానీ అతను చివరి శ్వాస వరకు తన ప్రజల పాటనే పాడాడు. శరీరాన్ని హింసించవచ్చు. చేతులను విరగ్గొట్టవచ్చు. కానీ ప్రజలకు అంకితమైన గొంతును జయించడం ఎవరి వల్ల కాదు. నాగన్న జీవితమూ అదే చెబుతోంది. ఆయన శరీరాన్ని గెలిచింది. మరణం ఆయన జీవితాన్ని ముగించింది. కానీ ఆయన గొంతును కాదు. ఎందుకంటే ఆ గొంతు చాలాకాలం క్రితమే ఆయనది కాకుండా పోయింది. అది ప్రజలది అయిపోయింది. గొప్ప గాయకులు పాటలు పాడారు. వారు మనుషులను ఒకరి హృదయం నుంచి మరొకరి హృదయానికి మోస్తారు. అందుకే నాగన్నను తలుచుకున్నప్పుడు నాకు ఒక గొంతు గుర్తుకు రాదు. ఒక సంప్రదాయం గుర్తుకొస్తుంది. ముఖ్యంగా, గొంతుతో సంపాదించుకున్నవాడు కాదు.. గొంతునే సమాజానికి ఇచ్చిన ఒక మనిషి గుర్తుకొస్తాడు. అలాంటి గొంతులు నిశ్శబ్దం కావు. అవి ఒక్కో తరం గుండెల్లో కొత్త గొంతులుగా మళ్లీ పుడుతూనే ఉంటాయి.
– లెల్లే సురేష్

