రాజకీయ మార్పు వస్తే పాలన కూడా మెరుగుపడుతుందనే ఆశ ప్రజల్లో సహజంగానే ఉంటుంది. శాంతిభద్రతలను పునరుద్ధరిస్తామని, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం, గత పాలకుల తప్పిదాలను పునరావృతం చేయబోమని హామీలతో ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి. అయితే కొత్త ప్రభుత్వం కూడా గతంలో విమర్శించిన వైఫల్యాన్ని పునరావృతం చేస్తే లేదా పరిస్థితిని మరింత దిగజారిస్తే.. రాజకీయ మార్పు అంటే కేవలం ఒక పాలకవర్గం స్థానంలో మరో పాలకవర్గం రావడమేనా అని ప్రశ్నించే హక్కు ఓటర్లకు ఉంటుంది. ప్రభుత్వ మార్పు తర్వాత పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిణామాలు ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే లేవనెత్తుతున్నాయి. ఒక యువతి దారుణ హత్య, పరిపాలనా వైఫల్యాలపై ఆరోపణలు, మూక హింస, నిందితుడిని పోలీసులు వివాదస్పద రీతిలో కాల్చిచంపడం వంటి వరుస ఘటనలు పాలనా వ్యవస్థలోని ఆందోళన లోపాలను బయటపెట్టాయి. మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం రాజకీయ నాయకుల స్పందన. రాజ్యాంగ సూత్రాలు, చట్టబద్ధమైన ప్రక్రియను బలోపేతం చేయాల్సి ఉంది. అదే సమయంలో తమపై వస్తున్న విమర్శలను రాజకీయ కుట్రలుగానో, మతపరమైన ఉద్దేశాలతో చేస్తున్నవిగానో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆగ్రహంతో ఉన్న మూకలకు న్యాయం చేసే బాధ్యతను అప్పగిస్తే లేదా పోలీసులు న్యాయ ప్రక్రియను పక్కనపెట్టి వ్యవహరిస్తున్నారనే భావన కలిగితే ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయదు. ఒక వ్యక్తి దోష, నిర్దోషా అని నిర్ణయించే అధికారాన్ని రాజ్యాంగం మూకలకు లేదా రాజకీయ నాయకులకు ఇవ్వలేదు. ఆ బాధ్యత న్యాయస్థానాలదే.
ప్రతిపక్షంలో ఉండి నిరసనలు చేయడం కంటే అధికారంలో ఉండి పాలించడం చాలా కష్టమని రాజకీయ పార్టీలు తరచూ గ్రహిస్తుంటాయి. జవాబుదారీతనంతో కూడిన పాలనను కోరుకున్న అనేక మంది ఓటర్లు ఆ విమర్శలు ఆకట్టుకున్నాయి. అయితే కొత్త ప్రభుత్వ ప్రారంభ పాలన తీరు చూస్తుంటే.. కేవలం రాజకీయ నాయకత్వం మారినంత మాత్రాన వ్యవస్థలు వాటంతట అవే మారిపోతున్న విషయం స్పష్టమవుతోంది.
పోలీసు దర్యాప్తులో రాజకీయ రంగు పులుముకుంటే, విమర్శకులను ‘సంఘ విద్రోహులు’ లేదా ‘దేశ వ్యతిరేకులు’గా ముద్రిస్తే, తక్షణ న్యాయం పేరుతో చట్టబద్ధమైన ప్రక్రియను పక్కనపెడితే. ప్రత్యర్థి ప్రభుత్వం హయాంలో జరిగితే తీవ్రంగా నిరసించే చర్యలను అధికారంలోకి వచ్చాక సమర్థించుకుంటే ప్రభుత్వాలు నైతిక అధికారాన్ని కోల్పోతాయి. ఎన్నికైన ప్రతి ప్రభుత్వ చట్టబద్ధత అంతిమంగా రాజ్యాంగ ప్రక్రియలు, ప్రజల విశ్వాసంపైనే ఆధారపడి ఉంటుంది. పాలన నిర్వహణ దుర్వినియోగం, రెచ్చగొట్టే ఎన్నికల ప్రచారం, మతపరమైన విభజన, రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు లేకపోవడం వంటి ఆరోపణలు ఎన్నికలను చుట్టుముట్టిన ప్రతిసారీ ప్రజాస్వామ్య సంస్థలు మరింత నిశిత పరిశీలనకు గురవుతున్నాయి. రాజకీయంగా ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయి.. తమకు ఓటు వేసిన వారి కోసమే కాకుండా పౌరులందరి కోసం పాలిస్తున్నామని ప్రభుత్వాలు నిరూపించాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల్లో విజయం సాధించడం రాజకీయ ప్రతీకారానికి లేదా ఒక సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దడానికి లైసెన్స్ కాకూడదు. రాజకీయ పార్టీల కంటే వ్యవస్థలు బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యాలు మనుగడ సాగిస్తాయి.
సమకాలీన భారత రాజకీయాల్లో అత్యంత ఆందోళన కలిగిస్తున్న పరిణామం మతపరమైన కథనాలు క్రమంగా సాధారణ రాజకీయ వ్యూహంగా మారడం. భారతదేశంలో రాజకీయ పోటీ ఎప్పటినుంచో ఉంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలను సమీకరించేందుకు మతపరమైన గుర్తింపే ప్రధాన ప్రాతిపదికగా మారుతున్నట్లు గుర్తించారు. ఏదైనా నేరఘటన జరిగినప్పుడు పూర్తి వాస్తవాలు వెలుగులోకి రాకముందే దానిని మతపరమైన వివాదంగా మార్చే ప్రమాదం పెరుగుతోంది. సామాజిక మాధ్యమాలు వదంతులను మరింత విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నాయి. రాజకీయ ప్రసంగాలు అనుమానాలను మరింత పెంచుతున్నాయి. టెలివిజన్ చర్చలు రెండు పరస్పర విరుద్ధ వాదనలుగా కుదించి చూపిస్తున్నాయి. దీని పరిణామాలు ఎన్నికల ప్రచారాలకే పరిమితం కావు. వివిధ వర్గాల ప్రజలు ఒకరినొకరు అనుమానించడం ప్రారంభిస్తారు. పాలనా నిర్వహణ తటస్థతపై సందేహాలు తలెత్తుతాయి. పోలీసుల చర్యలను కూడా మతపరమైన కోణంలో చూడటం మొదలవుతుంది. పౌరులు తమను తాము ముందుగా భారతీయులుగా భావించడం క్రమంగా తగ్గిపోయి.. పరస్పరం పోటీపడే మతపరమైన వర్గాల సభ్యులుగా చూసుకునే పరిస్థితి పెరుగుతుంది. ఈ పరిణామం భారత రాజ్యాంగ గణతంత్ర వ్యవస్థ పునాదులనే బలహీనపరుస్తుంది. అయితే ఈ పశ్చిమబెంగాల్కే పరిమితం కాలేదు. అసోంలో పౌరసత్వం, నిర్బంధ కేంద్రాలు, ఆక్రమణల తొలగింపు చర్యలు, జనాభా మార్పులపై ఆందోళనలు, అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు తరచూ ఎన్నికల రాజకీయాలతో ముడిపడుతున్నాయి.
పౌరసత్వం, భూమికి సంబంధించిన చట్టాలను అమలు చేసే అధికారాలకు ఆధారం.. ఆయా విధానాలు స్పష్టంగా, మానవీయంగా, వివక్షకు తావులేకుండా ఉండాలి. లేదా వాస్తవమైన సమస్యలను పరిష్కరించే బదులు కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకునేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయనే భావన ఏర్పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్ హత్యలు, బుల్డోజర్లతో కూల్చివేతలు, ముందస్తు నిర్బంధాలు, కార్యనిర్వాహక అధికారాల విస్తృత వినియోగంపై తరచూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరాలను అణచివేసేందుకు ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని ఈ చర్యలను సమర్థించేవారు చెబుతున్నారు. అయితే ఇవి చట్టబద్ధమైన ప్రక్రియను బలహీనపరుస్తున్నాయని, రాజ్యాంగబద్ధ పాలనకు, కార్యనిర్వాహక వ్యవస్థ విచక్షణాధికారాలకు మధ్య ఉన్న హద్దులను చెరిపేస్తున్నాయని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే ప్రధాన ఆందోళన ఏదో ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనది కాదు. అసాధారణ చర్యలను క్రమంగా సాధారణ పాలనా విధానంగా సమాజం అంగీకరిస్తోందా అన్నదే అసలు ప్రశ్న.
రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వ సంస్థలను వినియోగించడం పెరుగుతుండటం మరో ఆందోళనకర పరిణామం. అధికారంలోకి వచ్చే ప్రతి కొత్త ప్రభుత్వం గత పాలకులపై దర్యాప్తును తిరిగి ప్రారంభించడం, కేసులు నమోదు చేయడం లేదా పరిపాలనా అధికారాలను ప్రయోగించడానికి మొగ్గుచూపుతున్నట్లు గుర్తించబడింది. ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు రాజకీయ విభజన కాకపోవచ్చు.. ప్రజల మౌనమే కావచ్చు. ప్రజాస్వామ్య క్షీణత సాధారణంగా ఒక్కసారిగా జరిగే ఏదో ఒక సంచలనాత్మక ఘటనతో చోటుచేసుకోదు. అది క్రమంగా ముందుకు సాగుతుంది. అసాధారణ చర్యలకు పౌరులు మెల్లగా అలవాటుపడతారు. బాధితులు మరో మత వర్గానికో, మరో రాజకీయ పార్టీకో, మరో సామాజిక వర్గానికో చెందినవారనే కారణంతో రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రజలు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. సమాజంలోని ఒక వర్గం కోల్పోయిన హక్కులు చివరకు అందరి స్వేచ్ఛను హరిస్తాయని చరిత్ర పదేపదే రుణం చేసింది. స్వతంత్ర మీడియా బలహీనపడటం, పౌర సమాజంపై దాడులు, అసమ్మతి వ్యక్తం చేసే అవకాశాలు క్రమంగా తగ్గిపోవడం, మెజారిటీ ఆధిపత్య రాజకీయాలకు ఆమోదం పెరుగుతుండటం.. సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడినీ ఆందోళనకు గురిచేయాల్సిన అంశాలు. ప్రభుత్వాలు తమ అధికారాలను స్వచ్ఛందంగా పరిమితం చేయడం వల్ల ప్రజాస్వామ్యం మనుగడ సాగదు. అధికారాలకు హద్దులు ఉండాలని పౌరులు పట్టుబట్టడం వల్లే అది నిలబడుతుంది.
పశ్చిమ బెంగాల్లోని కొత్త ప్రభుత్వానికి ఇప్పటికీ తన వైఖరిని సరిదిద్దుకునే అవకాశం ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలను సమర్థించకుండానే పోలీసు వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. న్యాయస్థానాలను పక్కనపెట్టకుండానే బాధితులకు న్యాయం చేయవచ్చు. నేరాలకు మతం రంగు పులమకుండానే శాంతిభద్రతలను పరిరక్షించవచ్చు. అధికారంలో ఏప్రదేశ్ పార్టీ ఉనికి అసోం, ఉత్తర దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికీ ఇదే వర్తిస్తుంది. ఎన్నికల ఫలితాలు మాత్రమే భారతదేశ భవిష్యత్తును నిర్ణయించబడతాయి. రాజకీయ అధికారాన్ని రాజ్యాంగ విలువలు ఎంతవరకు నియంత్రించగలుగుతున్నాయన్నదే దేశ భవిష్యత్తుకు కీలకం. ప్రభుత్వాలను మతపరమైన విభజన, ప్రతీకార రాజకీయాలపై ఎక్కువగా ఆధారపడుతూ, ప్రజాస్వామ్య సంస్థ బలహీనపరిస్తే.. ఎన్నికలు కొనసాగుతున్నప్పటికీ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య క్రమం గా కనుమరుగయ్యే గణతంత్ర దేశంగా భారత్ మారే ప్రమాదం ఉంది. అంతిమంగా ఈ బాధ్యతలపై ప్రభుత్వాలపై మాత్రమే లేదు. పౌరులు, రాజకీయ పార్టీలు, పౌర సమాజం, స్వతంత్ర న్యాయవ్యవస్థ, స్వేచ్ఛాయుత మీడియాతోపాటు భిన్నమైన ప్రజాస్వామ్య భారతదేశం గురించి రాజ్యాంగం ఇచ్చిన హామీని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్న ప్రతి వ్యవస్థపైనా సమాన బాధ్యత ఉంది. రాజకీయ మెజారిటీ ఎన్నటికీ రాజ్యాంగపరమైన మెజారిటీ ఆధిపత్యంగా మారకుండా పౌరసమాజం మాత్రమే నిరోధించగలదు.
గీతార్థ పాఠక్
(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)

