రామ్ మోహన్ నాయుడు: తెలంగాణలో మరో రెండు ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి వరంగల్ వాసులు ఎప్పటి నుంచో ఆసక్తిగా కోరుకునే వరంగల్ (మామునూరు) ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని జూన్ 2, 2028 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్న కేంద్ర మంత్రి ప్రకటించారు. ఎయిర్‌పోర్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకమని, భూసేకరణ పూర్తి చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఈ విషయంలో వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణ ఒక చరిత్ర జరిగింది, ఇంత త్వరగా ఒక్క ఎకరా తక్కువ లేకుండా భూమిని సేకరించి తమకు అప్పగిస్తారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఢిల్లీలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుపై ఇరునేతలు సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చల వివరాలను వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుబట్టి ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. వరంగల్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంతో ఇష్టమైన ప్రాంతమని, అక్కడి చరిత్ర, సంస్కృతి దృష్ట్యా ప్రధాని కూడా పూర్తి సహకారం అందిస్తున్నారని కూడా తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వద్ద ప్రస్తుతం 700 ఎకరాల స్థలం ఉంది, ఇప్పటికే ఎయిర్పోర్ట్ బౌండరీ వాల్ నిర్మాణ టెండర్లు వేశామని కేంద్ర మంత్రి వివరించారు. రన్‌వే నిర్మాణానికి సంబంధించిన టెండర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. రాబోయే మూడు, నాలుగు వారాల్లో మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ కోసం కూడా టెండర్లు పిలిచి పూర్తిస్థాయి పనులు ప్రారంభిస్తామన్నారు. జూన్ 2, 2028 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలన్న సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు నిర్దేశిత టైమ్‌లైన్ ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించింది. వరంగల్ సంస్కృతి, కాకతీయ కట్టడాలు, అక్కడి ఆలయాల వైభవం ఉట్టిపడేలా టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తామని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను కూడా తీసుకుంటామని చెప్పారు. దేశంలో ఏవియేషన్ రంగాన్ని ఒక హబ్‌గా మార్చాలన్నదే ప్రధాని లక్ష్యమని, ఆయన ప్రధాని అయ్యాక దేశంలో 90కి పైగా ఎయిర్‌పోర్టులు నిర్మించామని, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి తన హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఇదే సమావేశంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పైన కూడా కీలక చర్చ జరిగింది. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ రక్షణ శాఖ (డిఫెన్స్) ఆధీనంలో ఉందని, ఇప్పటికే తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి మరో 1,500 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంది, దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. భూసేకరణ పూర్తయితే ఆదిలాబాద్‌లో సివిల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి వస్తుందని, దీనికోసం కేంద్రం తరపున పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత విమానాశ్రయాలలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటని కేంద్రమంత్రి కొనియాడారు. దేశంలోని విమానయాన సౌకర్యాలు భారీగా పెరుగుతున్నాయని, రానున్న పదేళ్లలో ‘ఉడాన్’ (UDAN) పథకం ద్వారా రూ. 30,000 కోట్లు ఖర్చు చేసి మరో 100 కొత్త ఎయిర్‌పోర్టులను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

