ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే కమర్షియల్ గా హిట్టా కాదనేది తేలుతుంది. పది రోజుల క్రితం విడుదలైన రావు బహదూర్ చాలా మంది విమర్శకులను ఓ మోస్తరుగా మెప్పించింది. ఫస్ట్ హాఫ్ హెచ్చుతగ్గులు ఎలా ఉన్నా సెకండాఫ్ కు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అనుకోకుండా నాగబంధంకు వచ్చిన హైప్ ఇటు సత్యదేవ్ మూవీ మీద ప్రభావం చూపించిన మాట వాస్తవం.
అలాని నాగబంధం సూపర్ హిట్టయ్యిందా అంటే అదీ లేదు. మూడు రోజులు బాగా హడావిడి చేసి డీసెంట్ వసూళ్లు దక్కించుకుంది కానీ పాజిటివ్ పబ్లిక్ టాక్ అయితే రాలేదు. కానీ రావు బహదూర్ కు సోమవారం నుంచి పూర్తిగా కోలుకునే ఛాన్స్ దక్కలేదు. ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోయాయి. హైదరాబాద్ లో నెంబర్లు కనిపించాయి కానీ బిసి సెంటర్స్ లో ఎదురీత తప్పలేదు. రెండో వారం పికప్ కోసం చూద్దామంటే ఊహించని విధంగా లెనిన్ పెద్ద హిట్టయిపోయి అందరినీ సైడ్ చేసింది.
రావు బహదూర్ ని ఎందరో సెలబ్రిటీలు భుజాన మోశారు. సందీప్ రెడ్డి వంగ, సుకుమార్, రాజశేఖర్, వివేక్ ఆత్రేయ మొదలైన వాళ్ళు ప్రత్యేక షోలు చూసి మరీ దర్శకుడు వెంకటేష్ మహా, హీరో సత్యదేవ్ ని ప్రశంసలతో ముంచెత్తారు. నిర్మాణ భాగస్వామిగా ఉన్న మహేష్ బాబు విడుదలకు ముందు పొగడ్తలతో ట్వీట్ చేశారు కానీ తన పరిమితుల దృష్ట్యా పదే పదే ప్రమోట్ చేయలేకపోయాడు. సో ప్రముఖుల నుంచి వచ్చిన రెస్పాన్స్ జనాల నుంచి రాకపోవడమే ఇబ్బందిగా మారింది.
కొన్ని ప్రయత్నాలు మంచివే. కాదనడం లేదు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ కూడా ఇస్తాయి. కానీ అధిక శాతం ఆడియన్స్ కి అవి చేరినప్పుడు, వాళ్ళను కుటుంబాలతో పాటు టికెట్లు కొనేలా చేయనప్పుడు యావరేజ్ లేదా ఫ్లాప్ ముద్ర తప్పదు. రావు బహదూర్ ఏ క్యాటగిరీలోకి వస్తుందనేది కళ్ళముందు కనిపించింది. సత్యదేవ్ తన శాయశక్తులా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు కానీ సినిమాల్లో మాత్రం డ్రామా, కమర్షియల్ టచ్, ఎమోషన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ తగుపాళ్ళలో ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.

