తెలంగాణ: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి సొంత పార్టీపైనే ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్, బీజేపీ బలం పుంజుకుంటున్నాయని, కాంగ్రెస్ మేలుకోవాలంటూ ఆమె సూచన నిజమే కావచ్చు. కానీ అంతర్గత సమావేశాలలో చేయాల్సిన వ్యాఖ్యలను మీడియా ముందు చేయడంతో రేణుకా చౌదరి తన సొంత ప్రభుత్వంపై అసంతృప్తితో కనపడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేణుకా చౌదరికి రాజ్యసభ పదవి అప్పజెప్పారు. కానీ ఆమె అంతటితో సంతృప్తి చెందలేదని అంటున్నారు. తనకు సరైన ప్రాధాన్యతను గుర్తించడం లేదని ఆమె కొంత కాలంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఛార్జి మీనాక్షి నటరాజన్ తో సమావేశమై రాష్ట్ర పరిస్థితులతో పాటు ఖమ్మం జిల్లా రాజకీయాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో లేరు. సొంత పార్టీలో ఉంటారని రేణుకా చౌదరి మరోసారి రుజువు చేశారు. ఒకవైపు రేవంత్ రెడ్డి 2029 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంటుంటే.. కానీ రేణుకా చౌదరి మాత్రం కాంగ్రెస్ బలహీనపడుతుందని వ్యాఖ్యానించడంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ లు బలపడుతున్నారని అనడం విపక్షాలకు అస్త్రం దొరికినట్లే. మొన్న ఖమ్మం జిల్లా మధిర సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని చెప్పిన గంటలు గడవక ముందే కాంగ్రెస్ మేలుకోవాలని అనడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
రేణుకా చౌదరికి తొలి నుంచి ఒకరకమైన ఇగో ఉందని సొంత పార్టీ నేతలే అంటుంటారు. తనను గుర్తించుకుంటే ఎవరినైనా విమర్శిస్తారని, ఆమె తనను గుర్తించాలన్న తపనతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పరిపాటి అని కొందరు కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పాలనుకున్నప్పటికీ అక్కడ ముగ్గురు మంత్రులు వేలు పెట్టనివ్వడం లేదు. కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి బీజేపీ నేతలు వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అనడం తో పాటు సమస్యలు చాలా ఉన్నాయాంటూ రేవంత్ సర్కార్ పై పరోక్ష విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. హైకమాండ్ వద్ద తనకు పట్టు ఉందన్న భావన ఆమెలో నిత్యం కనిపిస్తూనే ఉంటుందన్నది కాంగ్రెస్ వర్గాల మాట. మరి రేణుకను కట్టడి చేయడం ఎవరి తరమూ కాదేమో.

