- తెలంగాణ బీజేపీ నేతల్ని ఒక్క తాటి మీదికి తెచ్చే ప్రయత్నాలు..
- ప్రతి ప్రోగ్రామ్లో అంతా ఇన్వాల్వ్ అయ్యేలా చర్యలు..
- సొంత ఇమేజ్ కోసం కాకుండా పార్టీకి పనిచేయాలని ఆదేశాలు.
- వ్యక్తికి క్రెడిట్ కాకుండా పార్టీకే ఉండాలన్న సూచనలు..
- కార్యక్రమంలో పాల్గొనని వారిని జవాబుదారీ చేసే ఆలోచన..
ఆఫ్ ద రికార్డ్: తెలంగాణ కమలం పార్టీలో భారీ మార్పు కోసం ఆ పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉంటూ పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న వాళ్లందర్నీ సెట్ చేసి ఒక్క తాటి పైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందట. ఆ విధంగానే… ఏ ముఖ్య కార్యక్రమం చేసినా… అందరూ ఇన్వాల్వ్ అయ్యేలా జాగ్రత్త పడుతోంది. ఈ కార్యక్రమం నాది అనే భావన అందరిలో కలిగేలా పెద్దలు జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. సొంత ఇమేజ్ కోసం కాకుండా పార్టీ యాంగిల్లోనే, లైన్లోనే పని చేయాలంటూ రాష్ట్ర నాయకులకు ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారట. ఎవరికి వారుగా కాకుండా… నేతలందరినీ కలుపుకుని వెళ్ళేలా ప్లానింగ్ ఉండాలని క్లారిటీ ఇచ్చేసినట్లు చెబుతున్నారు.
బీజేఎల్పీ నేత ఆధ్వర్యంలో జరిగిన రైతు ఘోష- బీజేపీ భరోసా యాత్రలో నేతలందరూ పాల్గొనడం భాగమేనని అంటున్నారు. మూడు రోజులకు పైగా జరిగిన యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన సింగరేణి భరోసా యాత్రలోనూ ముఖ్యనేతలు ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు, బీజేఎల్పీ నేత రెండు రోజులు ఆయనతోనే ఉన్నారు. వ్యక్తికి క్రెడిట్ కాకుండా పార్టీకి రావాలని, పార్టీ జెండా కిందనే పని చేస్తున్నామనే భావన రావాలన్న ఉద్దేశ్యంతోనే ఈ విధంగా చూపుతోంది. గతంలో వీళ్ళందరినీ కలిపి ఒక బస్సు యాత్ర చేయాలని అనుకున్నా… అది కార్యరూపం దాల్చలేదని… ఇక్కడి నేతలకు ఎంత చెప్పినా పట్టించుకోలేదని… ఇప్పుడు మార్పు కనిపిస్తోందని రాష్ట్ర పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న నాయకుడు ఒకరు కామెంట్ చేశారు.
గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఒక్కరే ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు, చాలా మంది పెద్ద నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారనే ప్రచారం జరిగింది… ఇక ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు… అందరూ కలిసి వెళ్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ప్రోగ్రామ్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళనే జవాబుదారీ చేసే పని మొదలైంది. సీనియర్ కేంద్ర మంత్రులు వచ్చినా… రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు వాళ్ళ వెంట ఉన్నారు. గతంలో పరిస్థితి అలా ఉండేది కాదని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక ఎవరికి వారు సొంత అజెండాలు పక్కనబెట్టి పార్టీ బాటలోనే నడవాలనేది తెలంగాణ బీజేపీలో గట్టిగా వినిపిస్తున్న వాయిస్.

