NDA మెజారిటీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు మళ్లీ చర్చకు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లును ఆమోదించాలంటే లోక్సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ఇటీవల మారుతున్న రాజకీయ సమీకరణలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలను మరింత పెంచుతున్నాయనే చర్చ సాగుతోంది.
గతంలో ఈ బిల్లుకు తగిన మద్దతు లభించలేదు. అయితే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో చోటుచేసుకున్న పరిణామాలు, శివసేనలో జరిగిన మార్పులు, శరద్ పవార్ నుంచి ఎన్సీపీ వర్గం నుంచి వస్తున్న సంకేతాలు ఎన్డీఏకు అనుకూలంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా సుప్రియ సూలే చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై కొత్త చర్చకు దారితీశాయి.
డీలిమిటేషన్ విషయంలో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా లోక్సభ సీట్లను 50 శాతం పెంచితే తమ పార్టీ సానుకూలంగా ఆలోచించే అవకాశముందని సుప్రియా సూలే వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీట్ల పెంపుపై చర్చించేందుకు సిద్ధమని ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు వస్తోంది.
రాజకీయ పరిస్థితుల్లో ఎన్డీఏకు ఇప్పటికే ఉన్న బలానికి అదనంగా తిరుగుబాటు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, శివసేన నుంచి మారిన సభ్యులు, శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీలు మద్దతు ఇస్తే సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంలో డీఎంకే వైఖరి అత్యంత కీలకంగా మారింది. డీఎంకేకు చెందిన ఎంపీలు మద్దతు ఇస్తే ప్రభుత్వం లక్ష్యానికి మరింత చేరువ అవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ద్వారా 2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాల స్థానాల పునర్విభజన, సంఖ్య పెంపు, అలాగే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించిన అంశాలను వేగవంతం చేయాల్సి ఉంది. అందుకే ఈ బిల్లుకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై ఇంకా పూర్తి స్థాయిలో తమ వైఖరిని వెల్లడించలేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గే అవకాశాలపై గతంలో వ్యక్తమైన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలు ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం.
వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత డీలిమిటేషన్ బిల్లుపై ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎన్డీఏ మూడింట రెండు వంతుల మెజారిటీని సమీకరించగలదా? శరద్ పవార్ వర్గం, డీఎంకే వంటి పార్టీల తుది నిర్ణయం ఎలా ఉంటుంది? అనే దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ. ఈ సమావేశాల్లో జరిగే పరిణామాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

