పోలీసులు ఎంతగా నిర్బంధం విధించినా మొక్కవోని ధైర్యంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే, వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
- అట్టుడికిన బాల్కొండ నియోజక వర్గం
- వేల్పూర్‌లో అప్రకటిత కర్ఫ్యూ అమలులో ఉంది
- గృహనిర్బంధంలోనే సాగిన నిరాహార దీక్ష
- సాయంత్రం 5గంటలకు దీక్ష విరమణ
- ఆగస్టు 15లోగా ఆ నాలుగు సమస్యలు తీర్చండి.. లేదంటే ఉద్యమమే: వేముల
- దీక్ష అడ్డగింత దుర్మార్గం:కేటీఆర్, హరీశ్
నిజామాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోలీసులు ఎంత నిర్బంధం విధించినా మొక్కవోని ధైర్యంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే, వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, సర్కార్ హామీల అమలు ప్రధాన డిమాండ్లతో వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా నిరాహారదీక్షకు పూనుకున్నారు. దీక్షపై కత్తిగట్టిన కాంగ్రెస్.. పోలీసులను ఉసిగొల్పింది. దీంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రోజంతా ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరాహారదీక్ష చేపట్టిన వేములపై కక్షగట్టిన కాంగ్రెస్.. ఆయన దీక్ష భగ్నానికి ప్రయత్నమూ చేసింది. ఏకంగా పోలీసులతో గృహనిర్బంధం విధించింది.
ఆ నిర్బంధంలోనే బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జరిగింది. నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై ఆయన సమరశంఖం పూరించారు. మున్సిపల్ ఎన్నికలప్పుడు ఇష్టారీతిన ఇచ్చిన హామీలను, గత ప్రభుత్వ హయాంలో మంజూరై సగానికిపైగా పనులు చేపట్టడానికి ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు దిగుతోంది. 75 శాతం నిర్మాణం పూర్తిచేసుకున్న 100 పడకల దవాఖాన, భీమ్‌గల్ ఆర్టీసీ డిపో పునఃప్రారంభం, రూ.12 కోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ఫలితం రాలేదు. మొద్దు నిద్రను అవలంబిస్తున్న సర్కార్ తీరును ఎండగట్టేందుకే వేముల ఈ నిరాహార దీక్షకు పూనుకున్నారు.
వేల్పూరులో వేముల గృహనిర్బంధం
వేల్పూర్‌లోని తన ఇంటిలో వేముల ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. అప్పటికే ఆయన ఇంటికొచ్చిన నేతలతో కలిసి భీమ్‌గల్ వెళ్లేందుకు ప్రశాంత్‌రెడ్డి గట్టిగా ప్రయత్నించారు. వందలాదిగా వచ్చిన పోలీసులు అడ్డుకోవడంతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్వగృహం వద్దే పోలీస్ నిర్బంధంలో కఠోర నిరాహార దీక్షను కొనసాగించి తన పంతం నెగ్గించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు మాజీ మంత్రి వేములకు భీమ్‌గల్ వాస్తవ్యుడైన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుశేఖర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గృహ నిర్బంధంలో ఉన్న వేముల ప్రశాంత్‌రెడ్డికి బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా సంఘీభావం లభించింది. ఆయన వద్దకు వచ్చిన ఓ వృద్ధురాలు పోలీసుల వైఖరిపై మండిపడింది. ‘మా అయ్యను ఏంటికి పోనిస్తలేరు. ఏం తప్పు పని చేసిందని పోనిస్తలేరు. ఇట్లనేనా మీ పద్ధతి? ప్రజల కోసం పని చేసేటోళ్లను పోనివ్వకుంటే యాడికి పొమ్మంటారు’ అని పోలీసులను ఆ వృద్ధ మహిళ నిలదీసింది.
జైల్లో పెట్టినా పోరాటం ఆపను: వేముల
ప్రజాసమస్యల పరిష్కారం కోసం, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం తాను చేస్తున్న పోరాటాన్ని ఆపబోనని, పాలకులు తన గొంతు నొక్కలేరని, జైల్లో పెట్టిన తన పోరాటం ఆగదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. ఆగస్టు 15లోగా ఆ నాలుగు పనులు పూర్తిచేస్తే కాంగ్రెస్ నేత మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తానే స్వయంగా పూలమాల వేసి శాలువాతో సన్మానిస్తానని చెప్పారు. ఆ గడువులోగా పనులు పూర్తి కాకపోతే ఆగస్టు 16 నుంచి భీమ్‌గల్ ప్రజలతో కలిసి భారీ ఉద్యమాన్ని చేపడుతామని ప్రకటించారు.
వేముల నిర్బంధాన్ని ఖండించిన కేటీఆర్, హరీశ్
వేల్పూర్ నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటనల్లో తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ శాంతియుతంగా నిరాహారదీక్ష చేపట్టాలని ప్రశాంత్‌రెడ్డి నిర్ణయించుకొంటే, ఆయన్ను పోలీసులు నిర్బంధించడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనపై నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్యలపై శాంతియుత దీక్షను అడ్డుకోవడం దుర్మార్గమని ప్రజానీకం. ప్రశాంత్‌రెడ్డి గృహనిర్బంధం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనేనని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాన్ని అణచివేయడం లక్ష్యంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని.
వేదికను కూల్చేసిండ్రు!
వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేపట్టేందుకు భీమ్‌గల్ పట్టణంలోని బస్టాండ్‌ను వేదికగా చేసుకున్నారు. మంగళవారం రాత్రి నుంచే ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. తీరా బుధవారం తెల్లవారుజామున పోలీసుల ఆదేశాలతో దీక్ష శిబిరం కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన టెంట్లను పీకేశారు. దీక్షా శిబిరం వేదికను కూల్చేశారు. వేముల స్వగ్రామమైన వేల్పూర్‌లో పోలీసులు అప్రకటిత కర్ఫ్యూను అమలు చేసినట్టుగా వా తావరణం కనిపించింది. ప్రశాంత్‌రెడ్డి ఇం టిచుట్టూ పోలీసులు వలయంలా చేరారు. అక్కడికి వచ్చే ప్రతి కార్యకర్తను ప్రశ్నిస్తూ పోలీసులు ఇబ్బందులకు గురిచేశారు. ఉదయం నుంచే ఎక్కడికక్కడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేసి, పోలీస్స్టేషన్లకు.

