- దోచుకున్న సొమ్ముతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కామేపల్లి, వెలుగు: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మించి రూ.85.70 లక్షలు వసూలు చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను అరెస్టు చేసినట్లు సింగరేణి సీఐ ఎన్. సాగర్ తెలిపారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఆయన కేసు వివరాలు.
కామేపల్లి అతని బాసిత్ నగర్ కు చెందిన బానోత్ సాయికుమార్ (20), బెంగళూరుకు చెందిన నారాయణప్ప గురప్ప అలియాస్ భోగ లక్ష్మీనారాయణ(63) కలిసి ఈ మోసాలకు పాల్పడ్డారు. గురప్ప గతంలో ఉద్యోగాలు, భూములు, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి పలు రాష్ట్రాల్లో మోసాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు.
ఇటీవల ఖమ్మం జిల్లాకు వచ్చిన గురప్ప, కెప్టెన్ బంజర గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని భోగ లక్ష్మీనారాయణ పేరుతో అయ్యప్ప మాల ధరించి ఆధ్యాత్మిక వ్యక్తిగా పరిచయం పెంచుకున్నాడు. అన్నదానాలు, పడిపూజలు, శబరిమల, ఏడుపాయల యాత్రలు నిర్వహించి ప్రజల విశ్వాసాన్ని సంపాదించాడు. అనంతరం బానోత్ సాయికుమార్‌తో కలిసి 2026 ఫిబ్రవరి నుంచి కామేపల్లి మండలంతో పాటు ఖమ్మం 18 మంది బాధితుల నుంచి తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని చెప్పి రూ.85.70 లక్షలు వసూలు చేశారు.
వసూలు చేసిన డబ్బుతో గోవా పర్యటనలు, ధార్మిక కార్యక్రమాలు, అన్నదానాలు, దేవాలయ ఉత్సవాలు, ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులు పరారయ్యేందుకు కల్లూరులో ఓ బాలికను తమ వెంట తీసుకెళ్లడంతో అక్కడ కేసు నమోదైంది.
విషయం తెలుసుకున్న వారు బాలికను తిరిగి కల్లూరులో వదిలి బాసిత్‌నగర్‌కు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గురప్ప బాధితులు కర్నాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో కామేపల్లి ఎస్ఐ శ్రీకాంత్, ఎస్ఐ వెంకటరత్నం, పోలీసు సిబ్బంది ఉన్నారు.

