వర్షాలు లేక పంటలు నష్టపోతున్నాయి
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
సింగూర్ ప్రాజెక్టు రీపేర్లో తీవ్ర జాప్యం
జలశయంలో నీళ్లులేక సాగు, ప్రస్తుతం ఎద్దడి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-సంగారెడ్డి
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావం వల్ల ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, సంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాలు పడక పంటలు దెబ్బతింటున్నాయని, ప్రభుత్వం వెంటనే పంటను అంచనా వేసి రైతులను ఆదుకోవాలన్నారు. కరువు భారాలు రైతులపై పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో తోడు విద్యుత్ కోతలు కూడా పెరిగిపోయి రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు లేక సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో వర్షాధార పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా పత్తి, కంది, మినుము, పెసర వంటి పంటలు సాగు చేస్తే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తేమ లేకపోవడం వల్ల విత్తనాలు మొలకెత్తే దశలోనే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సింగూర్ ప్రాజెక్టు రిపేర్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో ఖరీఫ్ సీజన్లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. కరువు ప్రాంతాలుగా ఉన్న నారాయణఖేడ్, జహీరాబాద్‌తో పాటు ఆందోల్‌లో సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టుల్ని వెంటనే పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని నిర్ణయించారు. సింగూరూ ప్రాజెక్టులో నీళ్లు ఖాళీ చేయడం వల్ల పంటలకు సాగునీరే కాకుండా సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ ప్రజలకు తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని పట్టణాలు, గ్రామాల్లో సరఫరా లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచబడతాయి. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనా నేటికీ పూర్తి స్థాయిలో యూనిఫాం, బుక్స్, టాయిలెట్స్, సమస్యలు పరిష్కరించడం లేదు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, అతిమెల మానిక్, కె. రాజయ్య, జి.సాయిలు, రాంచందర్, ఎం. నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, నాగేశ్వర్ రావు, యాదగిరి, మహిపాల్, విద్యాసాగర్, రేవంత్, కృష్ణ ఉన్నారు.
పోస్ట్ సంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి మొదట కనిపించింది నవతెలంగాణ.

