ప్రతి నాగరికతకు ఒక కల ఉంటుంది. ఆ కలలను సాకారం చేసే క్షణాలు చరిత్రలో మైలురాళ్లుగా నిలుస్తాయి. మనిషి ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపడిన రోజులు ఎన్నో ఉన్నా, ఆ ఆకాశాన్ని అర్థం చేసుకోవాలని సంకల్పించిన రోజే విజ్ఞానయుగానికి నాంది పలికింది. నేడు నిర్వహిస్తున్న అంతర్జాతీయ చంద్ర దినోత్సవం కేవలం చంద్రుని గురించిన ఉత్సవం కాదు, అసాధ్యాన్ని సాధ్యంగా మార్చిన మానవ మేధస్సుకు, పరిశోధనకు, భవిష్యత్తును నిర్మించే శాస్త్రీయ దృక్పథానికి అంకితమైన రోజు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ఈ దినోత్సవం మనకు ఒక ప్రశ్నను కూడా సంధిస్తోంది-విశ్వాన్ని జయించేందుకు ముందుకు సాగుతున్న మనిషి, తనలోని అజ్ఞానాన్ని కూడా అదే వేగంతో జయిస్తున్నాడా? చంద్రుడు మానవ సంస్కృతిలో వేల సంవత్సరాలుగా జీవిస్తున్నాడు. రైతు విత్తనం వేయడంలోనూ, కవి కలం కదలడంలోనూ, తల్లి లాలిపాటలోనూ, చిత్రకారుడి ఊహలోనూ చంద్రుడు ఒక మౌన సహచరుడు. కాలాన్ని కొలిచే పంచాంగాల నుంచి ప్రేమకు ప్రతీకగా నిలిచిన సాహిత్యం వరకు అతని ప్రభావం విస్తరించింది. కానీ, శాస్త్రం చంద్రుణ్ణి కేవలం అందానికి ప్రతీకగా చూడలేదు, అన్వేషించాల్సిన ఖగోళ ప్రపంచంగా చూసింది. ఈ దృక్పథమే మానవ నాగరికతను కల్పన నుంచి పరిశోధన వైపు నడిపించింది. చంద్రుని చేరాలంటే సంకల్పం ఒక్కరోజులో పుట్టలేదు. అనేక దశాబ్దాల పరిశోధనలు, అనేక మంది శాస్త్రవేత్తల కృషి, విఫల ప్రయో గాలు, అసంఖ్యాక సాంకేతిక సవాళ్లు కలిసి ఆ విజయానికి పునాది వేశాయి. చివరకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన అపోలో-11 యాత్ర మానవ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
భారత కాలమానం ప్రకారం 1969 జూలై 21న వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై తొలిసారిగా అడుగుపెట్టి ప్రపంచ చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఎడ్విన్ ”బజ్” ఆల్డ్రిన్ కూడా చంద్రుని నేలపై నడిచాడు. ఈ ఇద్దరూ చంద్రునిపై పరిశోధనలు నిర్వహించే విధంగా మైకేల్ కాలిన్స్ కమాండ్ మాడ్యూల్‌ను చంద్రుని కక్ష్యలో నడిపిస్తూ యాత్ర విజయానికి కీలక బాధ్యత నిర్వహించారు. చంద్రునిపై అడుగుపెట్టిన క్షణంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పలికిన “ఒక మనిషికి ఇది చిన్న అడుగు… మానవాళికి ఇది మహా గెంతు” అనే మాటలు శాస్త్ర చరిత్రలోనే కాదు, మానవ ఆత్మవిశ్వాస చరిత్రలో కూడా చిరస్థాయిగా నిలిచిపో యాయి. ఆ రోజు చంద్రుని నేలపై పడిన పాదముద్రలు ఇప్పటికీ చెరగలేదు, అలాగే మానవ సంకల్పానికి ఆ విజయం ఇచ్చిన ప్రేరణ కూడా ఎన్నటికీ చెరగదు. నేడు చంద్రుడి ప్రాధాన్యత పెరిగింది. ఒకప్పుడు అక్కడికి చేరడమే లక్ష్యమైతే, ఇప్పుడు అక్కడ శాశ్వత పరిశోధనా కేంద్రాల ఏర్పాటుపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. మంచు రూపంలో నీటి ఆనవాళ్లు, ఖనిజ సంపద, భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఇంధన అవకాశాలు, ఇతర గ్రహాలకు వెళ్లేందుకు చంద్రుణ్ని మధ్యంతర స్థావరంగా ఉపయోగించాలనే ఆలోచనలు ప్రపంచ శాస్త్రవేత్తలను కొత్త పరిశోధనల వైపు నడిపిస్తున్నాయి. రేపటి అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో చంద్రుడి పాత్ర అత్యంత కీలకంగా మారబోతోందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అంతరిక్ష పరిశోధనలు కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కావు. వాటి ప్రభావం వ్యవసాయం నుంచి సమా చార సాంకేతికత వరకు, వాతావరణ హెచ్చరికల నుంచి విపత్తుల నిర్వహణ వరకు, కమ్యూనికేషన్ నుంచి విద్య వరకు అనేక రంగాల్లో ప్రారంభమయ్యాయి. చంద్రుడి అధ్యయనం ద్వారా లభించే సమాచారం భూమి ఆవిర్భావం, వాతావరణ పరిణామం, సౌర కుటుంబ చరిత్ర వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను అందించే అవకాశం ఉంది. కాబట్టి అంతరిక్ష పరిశోధనలపై పెట్టుబడి ఖర్చు కాదు, అది భవిష్యత్తుపై పెట్టుబడి.
అయితే క్రమంగా అభివృద్ధి చెందుతున్న రూపాల్లో మూఢనమ్మకాలు కొత్తవిగా వ్యాపిస్తున్నాయి. గ్రహణాలు, గ్రహస్థితులు, ఖగోళ సంఘటనలపై ఇప్పటికీ అపోహలు ప్రచారంలో ఉన్నాయి. విజ్ఞానం మనిషిని చంద్రుని వరకు తీసుకెళ్లినా, మూఢనమ్మకాలు అతని ఆలోచనలను వెనక్కి లాగకూడదు. అందుకే ప్రతి పాఠశాలలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించే కార్యక్రమాలు, ఖగోళ విజ్ఞాన శిబిరాలు, విజ్ఞాన కేంద్రాల సందర్శనలు, పరిశోధన పట్ల ఆసక్తిని పెంచే చర్యలు మరింత విస్తరించాలి. ప్రశ్నిస్తే పిల్లలే రేపటి శాస్త్రవేత్తలు అవుతారు.
అంతరిక్షం నుంచి భూమిని చూసిన ప్రతి వ్యోమగామి చెప్పిన ఒకే సందేశం- మనకు కనిపించేవి దేశాల సరిహద్దులు కాదు, ఒకే భూమి. ఆ దృశ్యం మనిషిలో వినయాన్ని పెంచు తుంది. ప్రకృతిని సంరక్షించడం, యుద్ధాల కంటే శాంతిని ఎంచు కోవడం, విజ్ఞానాన్ని విధ్వంసానికి కాకుండా మానవ సంక్షేమానికి వినియోగించడం వంటి విలువలను చంద్ర దినోత్సవం మనకు మరోసారి గుర్తు చేస్తుంది. విశ్వం అపారమైనా, మనిషి బాధ్యత కూడా అంతే అపారమైనది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై వేసిన తొలి అడుగు కేవలం చంద్రుని నేలపై పడలేదు, ప్రతి బాలుడి కలలో, ప్రతి శాస్త్రవేత్త పరిశోధనలో, ప్రతి విద్యార్థి ఆశయంలో, ప్రతి దేశం అభివృద్ధి సంకల్పంలో కూడా ఆ అడుగు ప్రతిధ్వనిస్తోంది. విశ్వాన్ని జయించాలంటే ముందుగా అజ్ఞానాన్ని జయించాలంటే ఈ దినోత్సవం మనకు గుర్తుండిపోతుంది.
చిటికెన కిరణ్ కుమార్, 9490841284
పోస్ట్ చంద్రుడిని తాకిన అడుగు! మొదట కనిపించింది నవతెలంగాణ.

