భారత్‌లో డిజిటల్ చెల్లింపులు. మరింత సులభతరం చేసే దిశగా మరో కీలక అడుగు పడుతోంది. త్వరలో ఇంటర్నెట్ లేకపోయినా UPI ద్వారా షాపుల్లో పేమెంట్స్ చేసే సౌకర్యాలను తీసుకురావడానికి NPCI సిద్ధమవుతోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే, మొబైల్ ఫోన్‌కు కానీ, వ్యాపారి వద్ద ఉన్న పాయింట్ ఆఫ్ సెల్ టెర్మినల్‌కు కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా రూ.2వేల వరకు చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది.
ఎలా పనిచేస్తుంది?
ఈ సదుపాయం NFC టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. వినియోగదారుడు ముందుగా ఇంటర్నెట్లో ఉన్నప్పుడు తన UPI లైట్ వాలెట్లో డబ్బును లోడ్ చేసుకోవాలి. అనంతరం ఇంటర్నెట్ లేకపోయినా NFC సపోర్ట్ ఉన్న మొబైల్‌ను PoS టెర్మినల్‌కు ట్యాప్ చేస్తే పేమెంట్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో UPI PIN ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.
నెట్ లేకున్నా లావాదేవీ..
వ్యాపారి వద్ద ఉన్న PoS టెర్మినల్ ఆ సమయంలో ఇంటర్నెట్కు కనెక్ట్ కాకపోయినా, చెల్లింపు వివరాలను సురక్షితంగా భద్రపరుస్తుంది. నెట్వర్క్ తిరిగి అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆ సమాచారం NPCI సిస్టమ్‌కు పంపించి ధృవీకరణ పూర్తి చేస్తుంది. దీనితో విమానాల్లో, మెట్రో అండర్‌గ్రౌండ్ స్టేషన్లలో లేదా నెట్వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ కోసం వీలు కలుగుతుంది.
UPI లైట్ Xతో తేడా ఏమిటి?
NPCI ఇప్పటికే 2023లో UPI Lite Xను పరిచయం చేసింది. అయితే అది ప్రధానంగా NFC ఫోన్ల మధ్య లేదా NFC QR కోడ్, సౌండ్‌బాక్స్‌ల ద్వారా ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం రూపొందించబడింది. ఇప్పుడు తీసుకురానున్న కొత్త విధానంలో సాధారణంగా దుకాణాల్లో ఉపయోగించే సర్టిఫైడ్ పీఓఎస్ టెర్మినల్ల ద్వారా కూడా ఆఫ్‌లైన్ UPI పేమెంట్లు చేయవచ్చు. ప్రత్యేక పీఓఎస్ మెషన్స్ తయారీ సంస్థలు NPCI నుంచి ప్రత్యేక సర్ఫికేషన్ పొందాల్సి ఉంటుంది.
RBI నిబంధనలతో తేడా..
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులకు ఒక్కో లావాదేవీపై రూ. 500 పరిమితిని నిర్ణయించింది. అలాగే UPI లైట్లో అదనంగా రూ.1,000 వరకు చెల్లింపులకు అనుమతి ఉంది. కానీ కొత్త వ్యవస్థలో ఒక్కో లావాదేవీకి రూ.2వేల వరకు అనుమతి ప్రతిపాదన ఉంది. పరిశీలన NPCI త్వరలో పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.
డిజిటల్ ఇండియాకు మరో మైలురాయి..
2026 జూన్ నెలలో UPI ద్వారా 22.72 బిలియన్ లావాదేవీలు జరిగి రూ.28 లక్షల 92వేల కోట్ల విలువైన చెల్లింపులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆఫ్‌లైన్ UPI సదుపాయం అందుబాటులోకి వస్తే డిజిటల్ చెల్లింపులు మరింత విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాలు, విమాన ప్రయాణాలు, రైలు మార్గాలు, గ్రామీణ ప్రాంతాలు కూడా నగదు అవసరం లేకుండా సురక్షితంగా UPI ద్వారా చెల్లింపులు చేసే పరిస్థితులకు ఇది నాంది పలకనుంది.

