ఇంత గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు. కానీ ఐశ్వర్య రాజేష్ మాత్రం రచ్చ గెలిచి ఇంటికి వచ్చింది. ఆమె అచ్చ తెలుగు అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. 80వ దశకంలో తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన దివంగత నటుడు రాజేష్ తనయురాలే ఐశ్వర్య. ఐతే సినిమాల్లో నటించేటపుడు రాజేష్ కుటుంబం చెన్నైలో స్థిరపడడం వల్ల ఐశ్వర్య అక్కడే పుట్టి పెరిగింది. నటిగా అవకాశాలు వచ్చాయి.. మంచి గుర్తింపు సంపాదించింది. తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది.
మొదట్లో అంత కలిసి రాకపోయినా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో మంచి బ్రేక్ అందుకున్న ఐశ్వర్య, తర్వాత మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. వెంకీ తర్వాత మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చిత్రంలో నటించడం విశేషం.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న బాలయ్య.. దీని తర్వాత కొరటాల శివ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ.. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ నటించనుందట. ఐతే ఆమెది బాలయ్యకు జోడీగా నటించే హీరోయిన్ పాత్ర కాదట. ఇందులో ఆమెది నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్ర అని సమాచారం.
ఐతే ఐశ్వర్యనే మెయిన్ విలన్ పాత్ర చేసే అవకాశం లేదు. ఇందులో మరో పెద్ద విలన్ ఉంటారట. మంచి నటిగా పేరున్న ఐశ్వర్యకు నెగెటివ్ రోల్ ఇస్తే చెడుగుడు ఆడేస్తుందనడంలో సందేహం లేదు. అందులోనూ బాలయ్య-కొరటాల చిత్రంలో విలన్ పాత్ర అంటే కచ్చితంగా అది చాలా స్పెషల్‌గానే ఉంటుంది. సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ కలిసి ఈ చిత్రాన్ని రూపొందించాడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

