Published on: 4:19 pm, 22 జూలై 2026
అటు పార్లమెంటులోనూ.. ఇటు బయట కూడా.. నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన నిరసనలు కొనసాగుతున్న సమయంలో సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. ప్రధానంగా ఆగస్టు 1న విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రధానికి ఇచ్చారు.
పార్లమెంటులోని ప్రధాని మోడీని కలిసిన చంద్రబాబు.. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందించారు. దీనితోపాటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను, మొమెంటోను అందించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, ప్రతిపక్షం కాంగ్రెస్ చేస్తున్న ధర్నాలు వంటి విషయాలపైనా ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు చర్చించినట్లు ఏపీ భవన్ వర్గాలు తెలిపాయి. అయితే.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చంద్రబాబుతో ప్రకటన?
ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు, ఆందోళనలను విరమింప చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లోపల భాగంగా ప్రధాని మోడీ చంద్రబాబుతో ఈ విషయాన్ని చర్చించి.. ఆయన ద్వారా ప్రకటన చేయాలని చూస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలోనూ పలు సందర్భాల్లో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆయన సేవలను వినియోగించుకునే దిశగా మోడీ అడుగులు కనిపిస్తున్నాయి.

