పూజా హెగ్డే పేరుకు ఉత్తరాది హీరోయిన్ కానీ.. ఆమె సౌత్‌లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ముఖ్యంగా తెలుగులో ఆమె ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. తెలుగులో కెరీర్ ఆరంభంలో చేసిన ముకుంద, ఒక లైలా లాంటి చిత్రాలు నిరాశపరిచినా.. ‘దువ్వాడ జగన్నాథం’తో బ్రేక్ అందుకున్న ఆమె.. చూస్తుండగానే పెద్ద రేంజికి ఎదిగింది.
అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో లాంటి ఘనవిజయాలతో ఆమె దూసుకెళ్లింది. కానీ ఆమె కెరీర్లో పతాక దశ ఎక్కువ కాలం కొనసాగలేదు. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. ఎంత వేగంగా పైకి ఎదిగిందో.. అంతే వేగంగా కింద పడిపోయింది. దాదాపు మూడు పాటు తెలుగులో ఆమెకు సినిమానే లేని పరిస్థితి తలెత్తింది. ‘గుంటూరు కారం’ నుంచి తప్పించుకో.. తెలుగులో ఇంకో అవకాశమే అందుకోలేకపోయింది పూజ.
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న బహు భాషా చిత్రం ‘శ్రీశ్రీ’లో అవకాశం వచ్చినప్పటికీ.. ఫక్తు తెలుగు, తెలుగు హీరో సరసన ఆమెకు అవకాశం దక్కలేదు. ఐతే ఇప్పుడామె మాస్ రాజా రవితేజకు జోడీగా నటించబోతున్నట్లు సమాచారం. హాసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో రవితేజ, శ్రీ విష్ణు కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మాస్, కామెడీ ఎంటర్టైనర్లో పూజా హెగ్డే.. రవితేజకు జంటగా నటించనుందట. శ్రీ విష్ణు సరసన కథానాయికను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. రవితేజతో పూజ నటించనుండడం ఇదే తొలిసారి. ఈ వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంది కానీ.. అప్పటికి సినిమా రెడీ కావడం కష్టమే.

