ఆడుతూ పాడుతూ తిరగాల్సిన బాలుడు విధి ఆడిన నాటకానికి బలయ్యాడు. క్షణాల వ్యవధిలో జరిగిన అనూహ్య ప్రమాదం ఆ ఇంట్లో శోకాన్ని మిగిల్చింది. బాలుడి చిలిపి చేష్టలు ప్రాణాల మీదికి తెచ్చి తల్లిదండ్రుల జీవితాల్లో చీకటి నింపిన హృదయ విదారక ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి గ్రామంలో గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గూడెం గ్రామానికి చెందిన నికాడి గణేష్ కుమారుడు లోకేష్(14) బుధవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్నాడు. అక్కడ ఉన్న బ్యాటరీ ఆయన కంటపడింది. అది ఎంత ప్రమాదకరమైనదో తెలియని అతడు దానితో కలిపి
కరెంట్ వైర్లతో ప్రయోగం చేస్తుండగా ప్రమాదవశాత్తు బ్యాటరీ భారీ శబ్దంతో పేలిపోయింది. లోకేష్ ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో విలవిలలాడుతున్న బాలుడిని చూసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ లబోదిబోమన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పసిప్రాణం గాలిలో కలిసిపోయింది. తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. బాలుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. కౌటాల సీఐ సంతోష్, ఎస్ఐ కమలాకర్ సంఘటన పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.

