విద్యార్థి నిరసన: రాష్ట్రవ్యాప్తంగా నేడు (శుక్రవారం) విద్యా సంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI, AISF, NSUI, PDSU, AIFDS, AISB, AIPSU తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్ ఐక్యంగా నిర్వహించబడుతుంది. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసుల దాడులను నిరసిస్తూ.. విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు డిమాండ్లతో ఈ ఆందోళన చేపడుతున్నట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు.
ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులపై పారదర్శకంగా విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు. VBSA బిల్లును వెనక్కి తీసుకోవడంతో పాటు, NEET పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వరుస వైఫల్యాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మ ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ఇప్పటికే పలు విద్యా సంస్థలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. బంద్‌లో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

