రోజులు మారాయి.. ఆస్తి కోసం సొంత బంధాలు.. బంధుత్వాలు కూడా వదిలేసుకుంటున్న రోజులు వచ్చేశాయి. ఇంకా చెప్పాలంటే మనోడై పగోడవుతున్నాడు. డబ్బు, ఆస్తులు ఉంటే చాలు.. బంధాలు అవసరం లేదని చాలా మంది అనుకుంటున్నారు. ఒక్కోసారి డబ్బు, ఆస్తుల కోసం దారుణంగా హత్యలు కూడా వెనుకాడడం లేదు. అలాంటి ఘటనే మెట్పల్లి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఆస్తి కోసం అన్న కుటుంబానికే ఓ వ్యక్తి స్పాట్ పెట్టాడు. కానీ అదృష్టవశాత్తూ.. వారికి భూమిమీద నూకలు ఉన్నాయి కాబట్టి.. బతికి బయటపడ్డారు. ఐతే సరిగ్గా నెల రోజుల తర్వాత కేసులో కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది?
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దాదాపు నెల రోజుల క్రితం పిస్టల్‌తో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. ఆ కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదమే ఈ హత్యాయత్నానికి కారణమని తేల్చారు. సొంత వదినను హత్య చేసేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన జేసీబీ డ్రైవర్ సచిన్‌కు సుపారీ ఇచ్చి.. పిస్టల్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
జూన్ 15న అర్ధరాత్రి మెట్పల్లి పోచమ్మవాడలో ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. భారీ శబ్దంతో అక్కడి స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానికంగా ఉన్న మహిళ గోనెల లక్ష్మి అనేపై జరిగిన కాల్పుల ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మొదట కర్రలు, రాళ్లతో దాడి జరిగినట్లు గుర్తించిన పోలీసులు… శస్త్ర చికిత్సలో బాధితురాలు చెంప నుంచి బుల్లెట్ బయటపడటంతో దర్యాప్తు దిశ మార్చారు.
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ విశ్లేషణలు కేసులో కీలకంగా వ్యవహరించాయి. ఆర్థిక లావాదేవీల కోణంలో విచారణ పోలీసులకు కచ్చితమైన సమాచారం లభించింది. దీనితో ఇది ముందస్తు పథకం ప్రకారం జరిగిన హత్యాయత్నమని పేర్కొన్నారు. ఆస్థి వివాదం నేపథ్యంలో గోనెల శంకర్, అతని భార్య అనూష, బంధువు ముత్తన్న కలిసి ఉత్తరప్రదేశ్‌కు చెందిన తమ జేసీబీ డ్రైవర్ సచిన్ వర్మకు సుపారీ ఆశ చూపినట్లు పోలీసులు తెలిపారు. సౌదీకి పంపిస్తామని, మొత్తం భారీ హత్యను ప్రభపెట్టి ఏర్పాటు చేసినట్లు.
సచిన్ వర్మ ఉత్తరప్రదేశ్‌లో రూ.40 వేలతో నాటు పిస్టల్, మూడు కార్ట్రిడ్జ్లు కొనుగోలు చేసి మెట్‌పల్లికి తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలింది. జూన్ 15 అర్ధరాత్రి ముఖానికి రుమాలు కట్టుకుని గోనెల లక్ష్మిపై కాల్పులు జరపగా… బుల్లెట్ చెంపను తాకడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ కేసులో ఇప్పటికే గోనెల శంకర్, అనూష, ముత్తన్నను అరెస్ట్ చేసిన పోలీసులు… తాజాగా ఉత్తరప్రదేశ్‌లో సచిన్ వర్మను అదుపులోకి తీసుకుని మెట్పల్లి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల వద్ద నుంచి హత్యాయత్నానికి ఉపయోగించిన పిస్టల్, రెండు సజీవ కార్ట్రిడ్జ్లు, హోండా ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్, ఐఫోన్- 11ను స్వాధీనం చేసుకున్నారు.
గోనెల శంకర్‌కు తన అన్న రాజంతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. రాజం మానసికంగా బలహీనమైన వ్యక్తి కావడంతో అతని భార్య లక్ష్మీ అతని బాగోగులు, కుటుంబ విషయాలు చూస్తోంది. ఈ తనకు రావాల్సిన ఆస్తి కొంచెం కూడా అన్న రాజాం, వదిన లక్ష్మీకి చెందవద్దు అనే దురుద్దేశంతో గోనెల శంకర్ పథకం వేశాడు. ఇద్దరినీ చంపేస్తే ఆస్తి తనదే అవుతుందని కలలు కన్నాడు. ఇందులో భాగంగా జూన్ 15న అర్ధరాత్రి తర్వాత ఇంటి వద్ద నిద్రిస్తున్న రాజాం, భార్య లక్ష్మీపై దాడికి తెగబడ్డారు. తుచ్ఛమైన ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యుల హత్యకు కుట్ర పన్నడం… మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తికి సుపారీ ఇచ్చి రంగంలోకి దింపడం సంచలనం కలిగించింది.

